work from home : తుమ్మినా..దగ్గినా లీవ్

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 04:34 AM IST
work from home : తుమ్మినా..దగ్గినా లీవ్

తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల విషయాల్లో పలు చర్యలు చేపట్టాయి. ఆఫీసుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు.

క్రిమి సంహారక మందులను స్ప్రే చేయడం, దుమ్ము, ధూళి లేకుండా చేయడం వంటివి చేస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే..ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి యాజమాన్యాలు. ఆఫీసులకు సందర్శకులను అనుమతించడం లేదు. పలు ఆంక్షలు పెడుతున్నాయి. ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చేముందు..శానిటైజర్ చేతులకు రాసుకోవాలని సూచిస్తూ..బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. అంతేగాకుండా..ఎంట్రీ దగ్గరనే శానిటైజర్‌ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. 

భారతదేశంలో కరానా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎంతోమంది ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. వ్యాపార, వర్తక సంస్థలు, ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఆఫీసుకు వచ్చే బదులు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నారు. ఇప్పటికే ఐటీ రంగంలో దీనిని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన వారు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నాయి.

ఇందులో వోల్వో కార్స్ ఇండియా కూడా చేరిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. 2020, మార్చి 17వ తేదీ నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యమైన సమావేశాలు, మీటింగ్స్ జరుపుకోవాలంటే..కేవలం Skype లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవాలని సూచిస్తున్నాయి. ఒకవేళ ఆఫీసుకు వెళ్లి పనిచేయాల్సి వస్తే..మెడికల్ స్ర్కీనింగ్ పూర్తయిన తర్వాతే..ఎంట్రీకి అనుమతినిస్తున్నారు.

టాటా మోటార్స్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అమెజాన్, టీసీఎస్, విప్రో..ఇతర అగ్రగ్రామి సంస్థలు ఇంటి నుంచే పని చేసే ఆప్షన్ ఎంచుకోవాలని సూచిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా ఇలా చర్యలు తీసుకుంటున్నాయి. 

Read More : ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు