కరోనా కారణంగా భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం

కరోనా కారణంగా భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం

Corona exacerbates the burden of arrears on Indian banking : కరోనా కారణంగా భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హెచ్చరించింది. ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదికలో మొండిబకాయిల అంశాన్ని ప్రస్తావించింది. మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం సెప్టెంబర్‌ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత అది 23ఏళ్ల గరిష్ఠస్థాయి 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.5శాతం ఉండగా అది రెట్టింపు అవుతుందని రిజర్వ్‌బ్యాంక్‌ చెబుతోంది.

1997మార్చి ఆఖరుకు నమోదైన 15.7శాతమే ఇప్పటివరకూ అత్యధికం. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల GNPAల నిష్పత్తి గత సెప్టెంబర్‌లో 15.7శాతంగా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి అది 16.2శాతానికి చేరవచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం GNPAల నిష్పత్తి మరింత పెరగొచ్చు.

కరోనా పరిణామాల కారణంగా బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు బలహీనంగా మారొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంచనా వేశారు. బ్యాంకులకు మూలధన కొరతా ఏర్పడే అవకాశం ఉందన్నారాయన. కరోనా కాణంగా ఇచ్చిన వెసులుబాట్లను వెనక్కి తీసుకుంటే ఈ బలహీనతలు, మూలధన కొరతలు మరింత ఎక్కువగా కనిపించవచ్చన్నారు.

బ్యాంకులు మూలధనాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ వ్యాపార నమూనాలతో సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపారు. ప్రభుత్వం తన ఆదాయ కొరత పూడ్చుకునేందుకు రుణాలను పెంచుకుందని.. ఇది బ్యాంకులపై అదనపు భారాన్ని వేసిందని చెప్పారు.

NPAల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోవడం, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, రుణాలు తీర్చడంలో ఆలస్యం లేదా మొత్తంగా విఫలంకావడం లాంటి ఎన్నో అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి.

ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం, అసెట్‌ వర్గీకరణలో యథాతథ స్థితి, రుణ పునర్‌ వ్యవస్థీకరణ, కొన్ని అకౌంట్లను మొండిబకాయిలుగా ప్రకటించవద్దంటూ అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల లాంటి ఎన్నో అంశాలూ మొండిబకాయిలపై ఇంకా స్పష్టత లేకుండా చేస్తున్నాయి.