No Lockdown Or Curfew : భారత్ ను కమ్మేస్తున్న కరోనా, తెలంగాణలో నో లాక్ డౌన్, కర్ఫ్యూ

భారత్‌ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

10TV Telugu News

Corona in India : భారత్‌ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది… 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం దేశ వ్యాప్తంగా లక్షా 45వేల 384 కేసులు నమోదయ్యాయి… కరోనా దూకుడు చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లోనే రోజుకు రెండు లక్షల కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్ని ఆంక్షలు విధించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 లక్షలు దాటాయి. గత సెప్టెంబర్‌ తర్వాత యాక్టివ్‌ కేసులు పెరగడం ఇదే మొదటిసారి. గత పది రోజుల్లోనే యాక్టివ్‌ కేసులు 47శాతం పెరిగాయి. ఏప్రిల్‌ 1న దేశంలో 72వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా సంఖ్య లక్షా 45వేలకు చేరింది. అంటే 9 రోజుల్లోనే రెట్టింపుకన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి… మృతుల సంఖ్య కాస్త కంట్రోల్‌లో ఉన్నా.. కేసుల సంఖ్య మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళుతోంది. ఇక ఎప్పటిలాగానే మహారాష్ట్రలో 60 వేల కేసులు నమోదయ్యాయి.. కొత్తగా చత్తీస్‌గఢ్‌లో 11 వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది..

సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో కేసులు పెరుగడం తెలంగాణపై తీవ్రంగా పడుతోంది.. తెలంగాణలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3 వేలకు చేరువలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.. 24 గంటల్లో 2 వేల 909 మంది వైరస్ బారిన పడ్డారు. వరుసగా రెండోరోజు కూడా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య… లక్ష దాటింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో… పూర్తి స్థాయిలో కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అంశంపై మంత్రి ఈటల కాలేజీ యాజమాన్యాలతో సమావేశమయ్యారు. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో.. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. దీనికి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. డ్రగ్స్, ఆక్సిజన్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేయడంతో.. అందుకు ఈటల అంగీకరించారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్.