మాస్కుల తయారీ ఫ్యాక్ట‌రీలో 70 మందికి సోకిన కరోనా

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 06:17 PM IST
మాస్కుల తయారీ ఫ్యాక్ట‌రీలో 70 మందికి సోకిన కరోనా

కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో మాస్కులు త‌యారు చేసే యూనిట్‌లో పెద్ద సంఖ్యలో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం ఒక్క‌రోజే ఆ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే 40 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసిన‌ 70 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు వెల్ల‌డించారు. 

ఈ ఘ‌ట‌న‌పై సీఎం వి.నారాయ‌ణ‌స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా ప్లాంట్ నిర్వాహ‌కులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వల్లే 70 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణ‌మైన స‌ద‌రు ప్లాంట్‌ను వెంట‌నే సీల్ చేయాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని న‌డుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమిన‌ల్‌ కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 

కరోనా వైరస్ సోకిన కార్మికులు ఫ్యాక్ట‌రీకి ఏ ఏ గ్రామాల నుంచి వ‌స్తారో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో వీరికి స‌న్నిహితంగా మెగిలిన వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. పుదుచ్చేరిలో ఇప్ప‌టివ‌ర‌కు 461 కేసులు న‌మోదు అయ్యాయి. వీటిలో ప్రస్తుతం 276 యాక్టివ్ కేసులున్నాయి.