కరోనా ఔషధం కొవిఫర్‌ ధర రూ.5,400  

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 10:22 PM IST
కరోనా ఔషధం కొవిఫర్‌ ధర రూ.5,400  

కరోనా వైరస్ చికిత్స కోసం కొవిఫర్‌ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్‌ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటి విడుతగా 20 వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్‌, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రకు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. 

రెండో బ్యాచ్‌ 10వేల వయల్స్‌ను వారం రోజుల్లోగా విజయవాడ, కోల్‌కతా, ఇండోర్‌, పాట్నా, భువనేశ్వర్‌, భోపాల్‌, రాంచీ, కొచ్చిన్‌, త్రివేండ్రం, గోవాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు సైతం పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ ఔషధం ద్వారా రోగుల చికిత్స సమయం తగ్గి, హాస్పిటల్స్ పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నట్లు హెటిరో ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీనిని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చని సంస్థ వర్గాలు తెలిపాయి. రోగికి ఎన్ని వయల్స్‌ వాడాలో వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. 

దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గతవారం రోజులుగా 14 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, గురువారం రికార్డు స్థాయిలో 17వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా ఒకేరోజు 418 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. 

ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,71,697 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మహమ్మారి బారినపడిన వారిలో ఇప్పటివరకు 14,894 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.