ముంబాయిపై కరోనా పడగ : భవనాలు, స్కూళ్లు, స్టేడియాలు క్వారంటైన్ కేంద్రాలు

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 03:03 AM IST
ముంబాయిపై కరోనా పడగ : భవనాలు, స్కూళ్లు, స్టేడియాలు క్వారంటైన్ కేంద్రాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్‌ స్పాట్‌గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ప్రమాదాన్ని ముంబై ఎలా ఎదుర్కోబోతుందో అనే ఆందోళన ప్రారంభమైంది. స్కూళ్లు, స్టేడియంలు క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చేయాలని బృహన్‌ ముంబై మహానగర పాలక సంస్థ నిర్ణయించుకుంది.  

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే అతి పెద్ద యుద్ధానికి సిద్ధమైంది. రోజు రోజుకీ భయకంపితుల్ని చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా స్టేడియంలను, క్లబ్బులను, స్కూళ్లను ఏదీ విడిచి పెట్టడం లేదు. పెద్దగా ఉండే ప్రతి భవనాన్నీ క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చేందుకు తన అధీనంలోకి తీసుకుంది. వీటిలో అతి తక్కువ అంటే మైల్డ్ కరోనా లక్షణాలున్న వారిని ఉంచబోతోంది. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆఫ్ ఇండియాలోనే 8 వేల మందిని క్వారంటైన్ చేయవచ్చు.

ముంబైలో ఆస్పత్రులు కూడా కరోనా హాట్ స్పాట్స్‌గా మారడంతో ఇతర భవనాలను, ప్రాంగణాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చుతున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్స్‌లో వంద మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అలానే జస్లోక్ అనే మరో ఆస్పత్రిలోనూ ఓ నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇక్కడున్న 1005 మందికి టెస్టులు చేయగా… 21 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో 19 మందికి ఎలాంటి లక్షణాలు లేవు. బుధవారం దక్షిణ ముంబైలోని భాటియా హాస్పిటల్, ఖార్‌లోని హిందుజా హాస్పిటల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను అత్యంత ప్రమాదకరంగా భావించిన యంత్రాంగం.. కరోనా ట్రీట్మెంట్‌ కోసం స్పెషల్ డిజైన్డ్ ఆస్పత్రులు కావాలనే అభిప్రాయానికి వచ్చింది.

ఇప్పటికే ఢిల్లీలో కేవలం కరోనా చికిత్స కోసమే ప్రత్యేక ఆస్పత్రులు నెలకొల్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని… లోక్ నాయక్, జీబీ పంత్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్‌ను కోవిడ్-19 ఆస్పత్రులుగా మార్చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కరోనా పేషెంట్లలో దాదాపు 70 శాతం ఎలాంటి లక్షణాలు కన్పించకపోవడం కానీ… తక్కువ మోతాదులో లక్షణాలు ఉండటం కానీ గమనిస్తున్నట్లు ప్రకటించింది.

ఇలాంటి వారికి కోవిడ్-19 ఆస్పత్రులలో చేర్పించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే స్కూళ్లు, స్టేడియంలైతే తక్కువ పాటి దృష్టి పెట్టాల్సిన రోగులకు సరిపోతాయని, ఐసోలేషన్ అవసరమైన వారికి మాత్రం కోవిడ్-19 ఆస్పత్రుల్లో చేర్చాలంటూ సూచనలు జారీ చేసింది.

మరోవైపు రాబోయే ఐదారు రోజులే ముంబై మహా నగర వాసుల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. వేగంగా పెరిగిపోతున్న కేసుల సంఖ్య చూస్తుంటే రోజుకి 200, 300 కూడా నమోదు కావచ్చనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందో లేక ఇటలీ, న్యూయార్క్‌లా భయానక పరిస్థితికి దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రోజు రోజుకు రెట్టింపు సంఖ్యలో కేసులు పెరుగుతూ పోతే మాత్రం ముంబైని ఆ దేవుడే కాపాడాల్సి వస్తుందని గ్లోబల్‌వైజ్‌ వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తున్న వాళ్లు అంటున్నారు. కానీ, వచ్చే వారానికల్లా కచ్చితంగా ఇక్కడ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయి.

Also Read | కరోనా : మాస్క్ ధరించకపోతే జైలుకే..ఎక్కడో తెలుసా