కరోనా కల్లోలం, భారత్‌లో మళ్లీ భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా కల్లోలం, భారత్‌లో మళ్లీ భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడోరోజు కూడా మరణాల సంఖ్య 100కు దిగువనే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. కొత్తగా 89 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు లక్ష 57వేల 435 మంది ఈ మహ్మమారి కారణంగా ప్రాణాలు వదిలారు.

పాజిటివ్ కేసుల పెరుగుదల కారణంగా యాక్టివ్ కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో లక్షా 73వేల 413 మంది చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసుల రేటు 1.53 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 14వేల 031 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారు 1.08కోట్లకు పైబడగా.. రికవరీ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న(మార్చి 3,2021) 7లక్షల 75వేల 631 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ టీకా కార్యక్రమం ఇప్పటికే రెండో దశలోకి అడుగుపెట్టగా.. మార్చి3 నాటికి కోటి 66లక్షల 16వేల 048 మందికి టీకాలు వేశారు. నిన్న ఒక్కరోజే 9లక్షల 94వేల 452 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఇక వ్యాక్సిన్ కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్ల పైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసే సమయ పరిమితిని ఎత్తివేసింది. ఇక నుంచి ప్రజలు 24 గంటల్లో(24/7) ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలు కల్పించింది.