అనంత పద్మనాభుడికి ఆర్థిక కష్టాలు : బడ్జెట్ కష్టాలేంటి ? కేరళ సర్కార్‌తో పేచీ ఏంటి ?

అనంత పద్మనాభుడికి ఆర్థిక కష్టాలు : బడ్జెట్ కష్టాలేంటి ? కేరళ సర్కార్‌తో పేచీ ఏంటి ?

Anantha Padmanabhaswamy : రిచెస్ట్‌ గాడ్‌ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే… అనంత పద్మనాభస్వామికి ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. కేరళ సర్కార్‌కు బిల్లు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు అనంత శయనుడు. అసలు.. పద్మనాభ స్వామికి వచ్చిన బడ్జెట్ కష్టాలేంటి? కేరళ సర్కార్‌తో పేచీ ఏంటి?  కరోనా దెబ్బ రిచ్చెస్ట్‌ గాడ్‌ను కూడా బాకీ పడేలా చేసింది. లెక్కలేనంత సంపద కలిగిన అనంత పద్మనాభస్వామి ఆలయం.. ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాల్సిన 11 కోట్ల 70 లక్షల రూపాయలను బకాయి పడింది. కోవిడ్‌ కారణంగా ఆలయ ఆదాయం పడిపోయిందని.. ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించలేమంటూ ఆలయ తాత్కాలిక పాలక మండలి కోర్టు ముందు బేర్‌మంది.

అనంత పద్మనాభస్వామి ఆలయ భద్రత, నిర్వహణ కింద ప్రభుత్వానికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది జూలైలో ట్రావెన్‌కోర్‌ రాజవంశస్తుల నుంచి నిర్వహణను కోర్టు ప్రత్యేక కమిటీకి అప్పగించింది. అయితే అప్పటి నుంచి కోవిడ్‌ విజృంభించడం.. ఏకంగా ఆలయ అర్చకుల్లోనే పది మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆలయం మూతబడి ఆదాయం పూర్తిగా పడిపోయింది. విరాళాలు కూడా అందలేదు. దీంతో అనంత పద్మనాభుడిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు చెల్లించలేని పరిస్థితులు తలెత్తగా.. కేరళ సర్కార్‌ కోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ప్రభుత్వం, ఆలయ కమిటీ తేల్చుకోవాలని తీర్పు ఇచ్చింది. అనంతమైన సంపదను కలిగి ఉన్న అనంత పద్మనాభుడే.. కోవిడ్‌ దెబ్బకు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆలయం తెరుచుకున్నా.. కోవిడ్‌ నిబంధనలను అనుసరించే తక్కువ మందికే ఆలయ దర్శనం కలిపిస్తున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. మళ్లీ రిచ్చెస్ట్‌గాడ్‌ డాబుగా దర్శనమిస్తాడని ఆలయ కమిటీ సభ్యులు భావిస్తున్నారు.