Corona Spreading: కరోనా ఒక్కరికి ఉంటే 406మందికి వచ్చినట్లే

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయి.

Corona Spreading: కరోనా ఒక్కరికి ఉంటే 406మందికి వచ్చినట్లే

Covid-19-cases-rise-in-india

Corona Spreading: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కొవిడ్‌-19 కేసులపై ప్రభుత్వం ఆందోళనలో పడింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, 46 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు.

మాస్క్‌లు, సామాజిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయి. దేశంలోని 59.8 శాతం కేసులు కొన్ని ప్రత్యేకమైన జిల్లాల నుంచే వస్తున్నాయి.

90 శాతం మరణాలు.. 45 ఏళ్లకు పైగా వయసున్న వారిలోనే సంభవిస్తున్నాయని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. మాస్కులపై 90 శాతం ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ 44 శాతం మందే ధరిస్తున్నారని, అందుకే రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీ ఫైన్లు విధించాలనుకున్నట్లు పేర్కొంది.

కరోనా కేసులు పెరుగుతోన్న కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు రాష్ట్రాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ గవర్నమెంట్లు ఆంక్షల అమలుకు ప్రాధాన్యమిస్తున్నాయి. కొవిడ్‌ కేసుల కట్టడికి మహారాష్ట్ర గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాజకీయ, మతపరమైన మీటింగులు క్యాన్సిల్ అవడంతో పాటు.. మాల్స్, రెస్టారెంట్ల సమయాన్ని పరిమితం చేసింది. మాల్స్, రెస్టారెంట్లు, పార్కులను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసేస్తున్నట్లు మహరాష్ట్ర గవర్నమెంట్ తెలిపింది. మాస్కు ధరించని వారికి రూ.500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసే వారికి రూ.1000 జరిమానా విధిస్తామని ఆదేశాలు జారీ చేసింది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ నెగిటివ్‌ నివేదిక ఉంటేనే గుజరాత్‌లోకి అనుమతి ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వివాహాలకు 200 మంది వరకే అనుమతి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లోని 12 నగరాల్లో ఆదివారం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది.