కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇలా..

కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇలా..

Corona vaccine distribution : కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి లభించింది. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రెండు వ్యాక్సిన్ల పరిమిత వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు డీసీజీఐ ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు కెడలాకు అనుమతి ఇచ్చింది.

కోవీషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల వినియోగానికి డీసీజీఐ అనుమతులు వచ్చేశాయి. దీంతో వారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాక్సినేషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా డ్రై రన్‌ విజయవంతంగా నిర్వహించారు. కొన్ని వర్గాల కథనం ప్రకారం జనవరి 6 నుంచే మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ఎవరికి వ్యాక్సిన్లు అందిస్తారు. ఎప్పుడు అందిస్తారు.. ఎలా అందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫస్ట్‌ ఫేజ్‌లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటగా కోటి మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్ల వయస్సు దాటిన 27 కోట్ల మంది సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. వీరి తర్వాత బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్లు అందివ్వాలని నిర్ణయించారు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య కోటి ఉంటుందని అంచనా

ఫస్ట్‌ఫేజ్ లో వ్యాక్సిన్‌ పొందుతున్న వారిలో అత్యధికంగా 27 కోట్ల మంది యాభై ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో యాభై ఏళ్లు పైబడిన వారిని ఎలా గుర్తిస్తారు అనేది కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా వయస్సును నిర్థారిస్తారు. అయితే వయస్సు లెక్కింపుకు 2019లో పార్లమెంటుకు జరిగిన సాధారణ ఎన్నికల సమయాన్ని కటాఫ్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. వ్యాక్సిన్‌ ఇచ్చే రోజు నాటికి ఒక వ్యక్తికి ఉండే వయస్సు కాకుండా ఎన్నికల సమయానికి ఉండే వయస్సు ఆధారంగా యాభై ఏళ్లను పరిగణలోకి తీసుకుంటారు. వారికే వ్యాక్సిన్లు అందిస్తారు.

ప్రపంచంలోనే అత్యధిక యువత మన దేశంలోనే ఉంది. కరోనాను తట్టుకునే శక్తి యువతరానికి ఎక్కువగా ఉండటంతో ఫస్ట్‌ ఫేజ్‌ వ్యాక్సినేషన్‌లో యువతకు చోటు దక్కలేదు. అయితే దేశంలో వ్యాధి విస్తరిస్తున్న తీరు, వ్యాధి తీవ్రతలతో పాటు వ్యాక్సిన్ల లభ్యతల ఆధారంగా 20 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్లు అందించే అంశంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా నవ, యువతరం వ్యాక్సిన్లు తీసుకుకోవడానికి కొన్ని నెలలు ఎదురు చూడాల్సి ఉండవచ్చు.

దాదాపుగా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపడుతోంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందివ్వడం ఒక మహా యజ్ఞం లాంటంది. అందుకే ఎన్నికలు నిర్వహించే పద్దతిలోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలింగ్ బూత్ తరహాలో వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతీ వ్యాక్సిన్‌ సెంటర్ లో వెయిటింగ్‌ రూమ్‌, వ్యాక్సిన్‌ రూమ్, అబ్జర్వేషన్‌ రూమ్‌లు ఉంటాయి.

ప్రతీ వ్యాక్సిన్‌ సెంటర్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్‌ …. టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ టీమ్‌కి డాక్టర్‌, నర్సు, ఫార్మాసిస్టులలో ఎవరో ఒకరు నేతృత్వం వహిస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రతీ సెషన్‌లో కనీసం 100 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్థానికంగా పరిస్థితులు అనుకూలిస్తే గరిష్టంగా 200ల మందికి వ్యాక్సిన్లు అందిస్తారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాధాన్యతా లిస్టులో లేకపోయినా వ్యాక్సిన్లు వేయించుకోవాలనుకునే వారు పేర్లు నమోదు చేసుకునేందుకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటిలిజెన్స్‌ నెట్‌వర్క్‌ – Co-WIN పేరుతో మొబైల్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓటర్‌ఐటీ, అధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పెన్షన్‌ పత్రాల్లో ఉండే సమాచారం అందివ్వడం ద్వారా Co-WIN యాప్‌లో వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, నమోదు చేసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి తదితర అంశాల ఆధారంగా వ్యాక్సిన్‌ అందిస్తారు.

మొత్తంగా భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సిద్ధమవుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్లు అందించేందుకు సిరంజీలకు బల్క్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఫస్ట్‌ ఫేజ్‌ను జులై చివరి నాటికి పూర్తి చేసి అక్టోబరు చివరి నాటికి అవసరమైన అందరికీ వ్యాక్లిన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది . మరికొద్ది రోజుల్లో కోవిడ్ భయం నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది.