COVID Surge : ఏపీలో రెండు, తెలంగాణలో వారం రోజులకు సరిపడా వ్యాక్సిన్లు

కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మహారాష్ట, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాలు చెబుతున్నాయి.

COVID Surge : ఏపీలో రెండు, తెలంగాణలో వారం రోజులకు సరిపడా వ్యాక్సిన్లు

Corona Vaccine Shortage

Corona Vaccine Shortage : కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మహారాష్ట, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరవలేమని తెగేసి చెబుతున్నాయి. మహారాష్ట్రలో రెండు రోజులకు సరిపడా స్టాక్‌ ఉంటే.. ఒడిశాలో ఉన్న స్టాక్‌ ఈ రోజుతో పూర్తయిపోతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏపీలో రెండు రోజులకు, తెలంగాణలో వారం రోజులకు సరిపడా వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయి. ఇప్పటికే ఒడిశాలో ఏడు వందల వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మూసివేశారు.

మహారాష్ట్రలో కూడా పలు వ్యాక్సిన్‌ కేంద్రాలు మూతపడుతున్నాయి. పన్వేల్, పుణె పరిధిలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్, నోయిడాలోనూ పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. వ్యాక్సిన్ కొరతతోనే మూసివేసినట్లు చెబుతున్నారు అధికారులు. బీజేపీయేతర రాష్ట్రాలకు డోసులను తక్కువగా పంపిస్తోందని కేంద్రంపై పలు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్లు అందించిన టాప్‌ త్రీ రాష్ట్రాల్లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు రెండు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నామని తెలిపింది.

ఇక, సైడ్‌ ఎఫెక్టులు తక్కువగా ఉన్నాయని చెబుతున్న కొవాగ్జిన్‌ టీకాను అడుగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొవాగ్జిన్‌ టీకా తయారీ ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా పెంచడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కసరత్తు చేస్తోంది. సొంతంగా తన ప్లాంట్లలో ఉత్పత్తి పెంచడంతో పాటు, ఇతర కంపెనీల ప్లాంట్లలోనూ ఈ టీకా తయారు చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన పానేషియా బయోటెక్‌ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలతో చర్చలు సాగిస్తోంది భారత్‌ బయోటెక్‌.
ప్రస్తుతం హైదరాబాద్‌ ప్లాంట్‌లో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది.

బెంగుళూరులో మరొక యూనిట్‌ను కూడా కంపెనీ సిద్ధం చేస్తోంది. అక్కడా కొవాగ్జిన్‌ తయారీ ప్రారంభమైతే, సొంతంగా ఏడాదికి 70 కోట్ల డోసుల టీకాను సంస్థ సరఫరా చేయగలుగుతుందని అంచనా. ఈ టీకాకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క, వ్యాక్సిన్‌ను తమకు నిర్ణీత గడువులోగా అందించలేకపోయిందంటూ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై బ్రిటన్‌ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు నోటీసులు కూడా పంపించింది. బ్రిటన్‌తో ఒప్పందం చేసుకున్నందున అక్కడ అవసరాలకు తాము వ్యాక్సిన్‌ సరఫరా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అదర్‌ పూనావాలా. అంత ఒత్తిడిలోనూ తాము భారత అవసరాలకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 10 కోట్ల డోసుల వరకు పెంచినా ఇండియాకు అవసరమయ్యే డోసులను మాత్రం ఇవ్వలేమంటున్నారు పూనావాలా.