ఏప్రిల్ కల్లా Oxford టీకా, రూ. 1000కి రెండు డోసులు

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 04:20 AM IST
ఏప్రిల్ కల్లా Oxford టీకా, రూ. 1000కి రెండు డోసులు

Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్‌లో ముందున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుంది..? ధర ఎంత ఉంటుందన్న చర్చ జరుగుతున్న వేళ.. సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో ఆడర్ పూనావాలా వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పారు.



భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు హెల్త్ కేర్ సిబ్బంది, వృద్ధులకు ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఈ ధర వెయ్యి రూపాయల్లోపే ఉంటుందని స్పష్టం చేశారు. వెయ్యి రూపాయలకే రెండు వాక్సిన్ డోస్‌లు అందజేస్తామన్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిలో సాధారణ ప్రజలందరికీ ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఆడర్‌ పునావాలా. 2024 నాటికి దేశంలోని పౌరులందరికీ వాక్సిన్ వేయడం పూర్తవుతుందని తెలిపారు.



వందల కోట్ల మంది భారతీయులకు వాక్సిన్ సరఫరా చేయాలంటే బడ్జెట్, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమని.. 2024లోపు అందరూ టీకా వేసుకుంటారని అనుకుంటున్నామని పునావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ధర మన దేశంలో రెండు డోస్‌లకు వెయ్యి రూపాయలు ఉంటుందని.. తక్కువ ధరకే టీకాలను తీసుకురావాలని భారత్ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. కొవాక్స్ ధరకు సమానంగా ఆక్స్‌ఫర్డ్ ధర ఉంటుందని.. అవసరమైతే ఇంకా కాస్త తక్కువే ఉంటుందన్నారు. 2021 మార్చి నాటికి 20 కోట్ల టీకాలు వచ్చే అవకాశముందని పూనావాలా తెలిపారు.



ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్‌ను తయారు చేశాయి. మనదేశంలో ఆ వాక్సిన్‌ ఉత్పత్తికి సీరం ఇనిస్టిట్యూట్‌ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ ధర చాలా తక్కువగా ఉంటుందని.. సురక్షితమైందంటోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్.