మళ్లీ కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు, 22రోజుల తర్వాత ఇదే తొలిసారి

మళ్లీ కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు, 22రోజుల తర్వాత ఇదే తొలిసారి

corona virus cases increase again in india: భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కరోనా అదుపులోకి వచ్చింది అని ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మరోమారు దాదాపు 14వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 13వేల 993 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం.

పెరుగుతున్న కేసులు, తగ్గుతున్న రికవరీలు:
ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 13వేల 993 కేసులు నమోదవగా.. గత 24 గంటల్లో 10వేల 307 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,06,78,048కి చేరింది. రికవరీ రేటు 97.27శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,127 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 101 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు పెరిగింది.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 87వేల 632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ..అందరికన్నా ముందు ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో రోజూవారీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ముంబైలో నిన్న ఒక్క రోజే 13వేల 592మందికి జరిమానా విధించారు. జరిమానాల రూపంలో 27లక్షల 18వేల రూపాయలు వసూలు చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి 19వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగినందుకు 15లక్షల 71వేల 679మందికి జరిమానా విధించారు. వారి నుంచి 31కోట్ల 79లక్షల 43వేల 400 రూపాయలు వసూలు చేశారు.