తెలంగాణకు చేరిన కరోనా ఔషధం

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 07:48 PM IST
తెలంగాణకు చేరిన కరోనా ఔషధం

కరోనా వైరస్ చికిత్సలో వినియోగించనున్న ఔషధం కొనిఫర్ ను తొలి విడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు. వీటిలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, డిల్లీలో సహా గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన గిలిద్ సైన్సెస్ అభివృద్ధి చేసిన రెమ్ డెసివర్ కు జనరిక్ తయారు చేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన హెటిరో ల్యాబ్స్ కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. హెటిరో తొలి విడతగా 20,000 వయల్స్ ను ఆయా రాష్ట్రాలకు అందజేసింది. మరో రెండు, మూడు వారాల్లో లక్ష వయల్స్ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 

కాగా, రెండో విడత ఔషధాన్ని కోల్ కతా, ఇండోర్, భోపాల్, లఖ్ నవూ, పట్నా, భువనేశ్వర్, రాంచి, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవా నగరాలకు పంపిణీ చేయనుంది. కొనిఫర్ పంపిణీ ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు లభించదని హెటిరో వివరించింది. అత్యవసర స్థితిలో ఉన్న కరోనా బాధితుల చికిత్స లో మాత్రమే కొనిఫర్ ను వాడనున్నారని సంస్థ తెలిపింది.  ఒక్కో కరోనా రోగికి కనీసం ఆరు మోతాదులు అవసరమని.. 100 మిల్లీగ్రాముల మోతాదు రూ. 5,400 అని సంస్థ వెల్లడించింది. 

కరోనా బారిన పడిన దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్ లో ఇప్పటికే సుమారు 4.73 లక్షల కేసులు, 14,894 మృతులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లోనే కేంద్రీకృతమై ఉన్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి.