భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 29వేల 429 కేసులు, 24వేలు దాటిన మరణాలు

  • Published By: naveen ,Published On : July 15, 2020 / 10:13 AM IST
భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 29వేల 429 కేసులు, 24వేలు దాటిన మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 9లక్షల 36వేల 181కి పెరిగింది. కొత్తగా మరో 582 మంది కరోనా రోగులు చనిపోయారు. దీంతో భారత్‌లో కొవిడ్‌ మరణాల సంఖ్య 24వేల 309కు చేరింది.

నిన్న ఒక్కరోజే 3లక్షల కరోనా టెస్టులు:
ఇప్పటివరకు 5లక్షల 92వేల 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3లక్షల 19వేల 840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.92శాతంగా ఉండగా, మరణాల రేటు 2.61శాతంగా ఉంది. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచారు. నిన్న ఒక్కరోజే 3లక్షల 20వేల 161 శాంపిల్స్ పరీక్షించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 24లక్షల 12వేల 644 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కాగా, రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి.