ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 06:35 AM IST
ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పాజిటవ్‌ కేసుల సంఖ్య 31కి చేరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన కరోనా బాధితుడు… ఇటీవల మలేషియా, థాయిలాండ్‌ దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఢిల్లీలో 18, ఆగ్రాలో 6, జైపూర్‌లో 2, హైదరాబాద్‌లో ఒకటి, ఘజియాబాద్‌లో ఒకటి. కేరళలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే… కేరళలో కరోనా సోకిన ముగ్గురు బాధితుల ఆరోగ్యం మెరుగవడంతో ఇప్పటికే వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 28మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ భయం ప్రజలను బలంగా వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలకు ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం.  ప్రకటించారు. ప్రజల్లో కరోనా భయం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

మరోవైపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది సర్కార్.

గత 4 రోజులుగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురుగ్రామ్‌లో పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్ బయటపడింది. దీంతో పేటీఎం తన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అతడితో కాంటాక్ట్‌లో ఉన్న ఐదుగురిని ఢిల్లీలోని శిబిరానికి తరలించారు. 

కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రులతో కూడిన హైలెవెల్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ… కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలకు భారతీయులు తమ ప్రయాణాలను రద్దుచేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి వచ్చే పౌరులకు దేశంలోకి ప్రవేశం నిషేధించింది. అలాగే ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ యాత్రికులు, విద్యార్థులను రప్పించడానికి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.(ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు)

మరోవైపు.. కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. మార్చి 13న బ్రస్సెల్స్‌లోని ఈయూ ఆఫీసులో జరగాల్సిన ఇండియా-ఈయూ సదస్సుకు మోదీ హాజరుకావాల్సి ఉండగా.. కరోనా భయాందోళనల కారణంగా ప్రధాని తన బ్రసెల్స్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.  

ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన తేదీల్లో సదస్సును నిర్వహిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే మోదీ బంగ్లాదేశ్ పర్యటన మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని వెల్లడించింది. 

Read More : ఏపీలో IPSలకు పదోన్నతులు, బదిలీలు : అదనపు డీజీగా ఆర్కే మీనా