చనిపోయిన తల్లిని లేవమంటూ..పిలుస్తున్నపసిబిడ్డ..వలస వేదనలో గుండెల్ని పిండేస్తున్న ఘటన

  • Published By: nagamani ,Published On : May 27, 2020 / 10:25 AM IST
చనిపోయిన తల్లిని లేవమంటూ..పిలుస్తున్నపసిబిడ్డ..వలస వేదనలో గుండెల్ని పిండేస్తున్న ఘటన

ముక్కుపచ్చలారనే లేదు. రెండేళ్లు కూడా నిండని పసిబిడ్డ. అమ్మ ఒడిలో పడుకుని ఆడుకున్న కాసేపటికే అనాధైపోయాడు. అమ్మ చనిపోయిందని తెలియని ఆ పసిబిడ్డ ‘అమ్మా..అమ్మా..అని పిలుస్తున్నాడు. అమ్మ పడుకుని ఉన్న దుప్పటి లాగుతూ..పిలుస్తున్నాడు. కానీ అప్పటికే తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయిందని పాపం..ఆచిన్నారికి తెలియదు. ఎంతటి కఠినాత్ముల గుండెలనైనా కదిలించివేసే ఈ ఘటన  బీహార్‌లోని రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
   
లాక్‌డౌన్‌ సమయంలో గుండెల్ని పిండేసే ఘటనలు ఎన్నో..ఎన్నెన్నో. అటువంటి అత్యంత విషాదాలకు అద్దంపడుతోంది ఆకలితో చనిపోయిన అమ్మను పిలిచే ఘటన. పొట్ట చేత పట్టుకుని..వేరే ప్రాంతానికి వెళ్లి..లాక్‌డౌన్‌తో పనిలేక..తినటానికి తిండి లేక..కడుపులు కాలిపోతుంటే..కన్నబిడ్డలకైనా పట్టెడు మెతుకులు పెట్టి బతికించుకుందామని ఆశతో సొంత ఊర్లకు పయనమవుతున్నారు వలసకూలీలు. వలస బతుకులు ఎంతటి కడు దుర్భరంగా ఉంటాయో కళ్లకు కడుతున్నాయి ఈ లాక్‌డౌన్ సమయంలో జరిగే వందలాది ఘటనలు. 

ఈ క్రమంలో వలసకూలీల కోసం వేసిన రైలు ఎక్కి సొంత ఊరు చేరుకుందామని బీహార్‌లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న 23 ఏళ్ల తల్లి బిడ్డను అనాధను చేసి ప్రాణాలులో కోల్పోయిన విషాద ఘటన సోమవారం (మే 25,2020)న జరిగింది.  

 అంతకంటే విషాద ఘటన మరొకటి..ఈ తల్లి ప్రాణాలు పోకముందే రెండు ఏళ్లు ఉన్న తన మొదటి బిడ్డను కోల్పోయింది. వలస బతుకుల్లో పట్టెడు మెతుకులు పెట్టి రెండేళ్ల బిడ్డ చిట్టి పొట్టను నింపలేకపోయింది. ఆకలితో ఏడ్చి ఏడ్చి చనిపోయింది. బిడ్డను కోల్పోయిన కడుపుశోకంతో అల్లాడిపోయింది. కంటికి కడివెడు కన్నీరుగా విలపించింది. తనలాంటి దరిద్రపు కడుపున ఎందుకు పుట్టావు తల్లీ అని గుండెలవిసేలా ఏడ్చింది.  

గుజరాత్ నుంచి ఆదివారం బీహార్ బయలుదేరిన ఆమె తిండిలేక పేగులు మెలిపెట్టేసే ఆకలితో రైలులోనే తీవ్ర అనారోగ్యానికి గురైంది. మండువేసవి..మండే ఎండలు..దాహం వేస్తే గుక్కెడు నీళ్లు కూడా దొరకని అంత్యంత దర్భరదౌర్భాగ్యపు స్థితిలో కూరుకుపోయింది.అలా ఆకలితో రైలు ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ కు చేరిందో లేదో..అలా దిగిన ఆమె కుప్పకూలిపోయి చనిపోయింది. తల్లి చనిపోయిందని తెలీక ఆ పసిబిడ్డ తల్లిని లేపటానికి చేస్తున్న యత్నం చూసినవారంతా కంటతడిపెడుతున్నారు. 

కానీ ఆమె రైలులోనే చనిపోయిందని అది తెలిసి రైల్వే అధికారులు బీహార్ లోని ముసఫర్ పూర్ స్టేషణ్ లో దించేశారనే విమర్శలు వస్తుండటంతో రైల్వే శాఖ స్పందిస్తూ..రైలు ఎక్కే సమయానికే అనారోగ్యంతో ఉందని ఆమె బంధువులు చెప్పారని రైల్వే అధికారులు తెలిపారు. కానీ అధికారులు వారిని బలవంతంగా రైలు దింపేశారనే వార్తల్లో వాస్తవం లేదని దయచేసి ఇటువంటి పుకార్లు పుట్టించవద్దని అభ్యర్థించారు. ఆమె తన సోదరి, సోదరి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కతిహార్ వెళ్తున్నట్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.