భారత్ లో 1024కి చేరిన కరోనా కేసులు…27మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 04:04 PM IST
భారత్ లో 1024కి చేరిన కరోనా కేసులు…27మంది మృతి

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ్,బీహార్ రాష్ట్రాల్లో ఒక్కో కరోనా మరణం నమోదవగా,మహారాష్ట్రలో 7,మధ్యప్రదేశ్ లో 2,కర్ణాటకలో 3,గుజరాత్ లో 4,ఢిల్లీలో2 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేసుల నమోదులో కేరళ రెండవ స్థానంలో ఉంది. మూడవస్థానంలో కర్ణాటక,నాలుగవ స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

కరోనా నేపథ్యంలో గత వారం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ… ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారని ఇవాళ(మార్చి-29,2020)మన్ కీ బాత్ సందర్భంగా హెచ్చరించారు. అలా చేస్తున్న వారు “తమ జీవితాలతో ఆడుకుంటున్నారు” అని అన్నారు. పేదలను అసౌకర్యానికి గురిచేసే లాక్ డౌన్ నిర్ణయానికి మోడీ క్షమాపణలు చెప్పారు. కానీ దేశప్రజలను కాపాడుకోవడానికి ఇది ఇప్పుడు అవసరమని మోడీ సృష్టం చేశారు.

మీ జీవితంలో, ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఈ కఠినమైన చర్యలు తీసుకున్నందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మీలో కొందరు నాపై కూడా కోపంగా ఉంటారని నాకు తెలుసు. కానీ ఈ యుద్ధంలో విజయం సాధించడానికి ఈ కఠినమైన చర్యలు అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ రేడియో ప్రసంగంలో “మన్ కి బాత్” లో అన్నారు.

 21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వందలాది మంది వలసదారులు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో….రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని కేంద్రం ఆదివారం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ వ్యవధిలో ప్రయాణించిన ప్రజలందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 14 రోజుల నిర్బంధంలో ఉంచాలని కూడా తెలిపింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు.