కరోనా సంక్షోభం…ఉగ్రవాదానికి ఆజ్యం

  • Published By: venkaiahnaidu ,Published On : June 1, 2020 / 03:52 PM IST
కరోనా సంక్షోభం…ఉగ్రవాదానికి ఆజ్యం

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా,ఆఫ్రికాలో కరోనా వైరస్ సంక్షోభం…ఉగ్రవాదసంస్థలు పెరగడానికి ఉపయోగపడుతుందంటున్నారు. కరోనా వైరస్,లాక్ డౌన్ ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవడం, ఆహారం కొరత మనుషుల్లో ఆక్రోశాన్ని, ఆగ్రావేశాలను పెంచుతుందని, వారు ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా తిరగబడేందుకు సిద్ధంగా ఉంటారని, అలాంటి సమయాల్లో ఏమాత్రం డబ్బులిచ్చి ఆదుకున్నా ఉగ్ర సంస్థల్లో చేరేందుకు ప్రజలు సిద్ధమవుతారని వారు తెలిపారు.

మరీ ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు, పేదలు, నిరుపేదలు టెర్రరిస్టు కార్యకలాపాలపై మొగ్గుచూపే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సాధారణంగా ప్రభుత్వాలు బలహీనంగా ఉన్న దేశాల్లో, సరిహద్దు వివాదాలు నెలకొని ఉన్న దేశాల్లో ఉగ్రవాదం మరింత‌ పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందని వారు చెప్పారు. ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా నైజీరియాలో బోకో హరామ్‌ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చి అలజడని పెంచాయన్నారు.

2019లో విడుదలైన ఓ అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాలోని 55 దేశాలు ఆహారం కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ఆ దేశాల్లో ఆహారం కొరత మరింత తీవ్రమైందని,ఆ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని బాయిస్‌ స్టేట్‌ యూనివర్శిటీ పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిషా బెల్లింగర్‌ హెచ్చరించారు.

సంపన్న దేశాల్లో కూడా కరోనా కారణంగా రాజకీయ,ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఈ సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరిన నేపథ్యంలో ఆయా దేశాలు ప్రజలకు ఆహారం అందించడం,శాంతిని నెలకొల్పడం వంటి సీరియస్ సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు. మరోవైపు కరోనాను కూడా తన ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. దీన్ని భూచిగా చూపించి ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. జైళ్లలో ఉన్న చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేసింది. ఇలా విడుదలైన వారిలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఒకడు. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ ను… జైల్లో ఉన్న ఖైదీల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సాకుతో వదిలేసింది ఇమ్రాన్ ప్రభుత్వం