కరోనా కలకలం : ధారావిలో ఏం జరుగుతోంది ? 

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 06:51 AM IST
కరోనా కలకలం : ధారావిలో ఏం జరుగుతోంది ? 

మురికివాడలకు పెట్టింది పేరైన ధారావిలో ఏం జరుగుతోంది..? దాదాపు 16 లక్షల మంది జీవనం సాగించే చోటును ఖాళీ చేయించడం సాధ్యమేనా..? ధారావి స్లమ్‌ ఏరియాలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది..?  ధారావి..ఇది ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ. ముంబైలోని ఒక ప్రాంతమైన ధారావి…భీవండి, సూరత్‌ వంటి వాణిజ్య కేంద్రాల తర్వాత వలస కార్మికులకు అత్యధికంగా పని కల్పిస్తున్న ప్రాంతంగా ప్రసిద్దికెక్కింది.

ఇక్కడ తోలు, వస్త్ర, రీసైక్లింగ్‌ వంటి చిన్నతరహా పరిశ్రమలు అధికం. దేశం నలుమూలల నుంచీ ప్రజలు బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తుంటారు. కిక్కిరిసినట్లు వుండే ఇళ్ల మధ్య, లక్షలాది పేదల కుటుంబాలు నివాసం ఉంటాయి. దాదాపు 16 లక్షల మంది జీవనం సాగించే…ధారావిలో తొలి కరోనా మరణం సంభవించింది. 56 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోయాడు.

సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం అతడు చనిపోగా.. అంతకు ముందే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జ్వరం రావడంతో అతడు మార్చి 23న స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు చెకప్‌ కోసం వెళ్లాడు. శ్వాస సంబంధ సమస్యలతో మార్చి 26న సియాన్ హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోయాడు. 
కరోనా వైరస్‌తో మరణించడాని తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ధారావి ప్రాంతానికి చేరుకున్నారు.

మృతుడు ఉంటున్న భవనాన్ని సీల్ చేశారు. భవనంలో దాదాపు 300లకు పైగా ఫ్లాట్స్‌లో అద్దెకుంటున్న వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. అయితే ఒకేసారి అందరిని తరలించడంపై స్థానికులు ఆగ్రహానికి గురైయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు పోలీసులపై రాళ్లు కూడా విసిరారు. దాంతో అక్కడి పరిస్థితులు రణరంగంగా మారాయి. ఇక ఆ మరుసటి రోజే ధారావిలో రెండో కరోనా కేసు నమోదైంది. 52 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు కోవిడ్-19 బారిన పడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందడం…మరొకరు వైరస్‌ బారీన పడటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.(నవ మాసాలు నిండిన గర్భిణీకి కరోనా పాజిటివ్‌)

ధారావిలో కిక్కిరిసినట్లు ఉండే ఇళ్లు…అక్కడ పారిశుద్ధ్యం అంతంత మాత్రమే. దాదాపు 16 లక్షల మందికి పైగా పేదలు దగ్గరదగ్గరగా నివసించే ధారావీలో వైరస్ విస్పోటనం జరిగితే ఊహించలేనంత పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశముంది. మరి..అక్కడ కరోనా మహమ్మరిని అరికట్టిందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.(ఎవ్వరూ భయపడవద్దు : కరోనాని జయించిన రాజమండ్రి యువకుడు)