కరోనా ఎఫెక్ట్ : విటులు లేక వేశ్యల నరక యాతన

కరోనా ఎఫెక్ట్ : విటులు లేక వేశ్యల నరక యాతన

కరోనా ఎఫెక్ట్ : విటులు లేక వేశ్యల నరక యాతన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది.  ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. 

వీరితో పాటు ఢిల్లీలోని వేలాది మంది సెక్స్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఇరుకు గదుల్లో  జీవనం సాగిస్తున్న సెక్స్ వర్కర్లు తిండి లేక, సొంత ఊళ్లకు వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించటంతో విటులు రాకపోవటంతో వీరికి ఆదాయం లేకుండా పోయింది.

వ్యభిచార గృహ నిర్వాహకులు వీరికి తిండి కూడా పెట్టకుండా  పస్తులుంచుతున్నారని పలువురు వాపోయారు. లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవటంతో  వ్యాపారాలు లేక… విటులు రాక దాదాపు 2 వేల మంది సెక్స్ వర్కర్లు ఇరుకు గదుల్లో మగ్గిపోతున్నారు. వారికి తినటానికి కూడా డబ్బుల్లేక పోవటంతో  జీవనం దుర్భరంగా మారిపోయిందని  కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు. 
 

ఢిల్లీలోని జీబీ రోడ్డులో గల అజ్మీర్ గేటు నుంచి లాహోర్ గేటు వరకు ఉన్న వంద వేశ్యాగృహాలు మూతపడ్డాయి. ఇక్కడ ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లో సుమారు 4 వేల మంది వేశ్యలు ఉండేవారని వీరిలో కొందరు వారి వారి స్వస్ధలాలకు వెళ్ళగా సగం మంది మాత్రం ఇక్కడే ఉన్నారని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక వేశ్య చెప్పింది.

లాక్ డౌన్ ప్రకటించటంతో వేశ్యాగృహ యజమానులు, వేశ్యలకు సమాచారం చెప్పకుండానే వారిని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు వేశ్యలు వెంటనే వారివారి స్వస్ధలాలకు వెళ్లిపోయారు. చేతిలో డబ్బులేక… సరైన సమాచారం లేక, ప్రభుత్వ ఆంక్షలు తెలియక 2 వేలమందికి పైగా ఇక్కడే అపరిశుభ్రమైన వాతావరణంలో తమ పిల్లలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.  

తినటానికి తిండిలేక…అనారోగ్యానికి గురైనా డాక్టర్ వద్దకు వెళ్లటానికి కూడా డబ్బులేని దీనావస్ధలోవారు ఉన్నారు. వీరివద్ద ఏడాది లోపు పసి వయస్సు కల పిల్లలు 50 మంది ఉండగా…ఏడాది పై వయస్సు ఉన్న పిల్లలు సుమారు 200 మంది ఉంటారు. కొన్ని స్వచ్చంద సంస్ధలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వీరికి ఆహరం అందిస్తూ వస్తున్నాయి. కానీ అదేమి వీరి ఆకలిని తీర్చలేక పోతోందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. 
 

డబ్బు కోసమే తాను పడుపు వృత్తిలోకి వచ్చానని… ఈపరిస్ధితుల్లో తనవద్ద చేతిలో చిల్లిగవ్వకూడా లేదని తన పిల్లవాడికి పాలివ్వటానవికి కూడా తన వద్ద శక్తి లేదని జార్ఖండ్ నుంచి వచ్చిన ఒక వేశ్య ఆవేదనగా చెప్పింది. మేము సమాజంలో వెలివేసిన వాళ్లమని మాకు తెలుసు కానీ మా గురించి పట్టించుకున్న వాళ్లే కరువయ్యారని వాపోయారు.  

వేశ్యా గృహాల్లో సరైన  జాగ్రత్తలు పాటించకపోవటం, ఇరుకు గదుల్లో అపరిశుభ్ర వాతావరణంలో  ఉండటం వల్ల వీరిలో ఎవరికైనా వ్యాధి సోకితే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. 

×