కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?

  • Published By: venkaiahnaidu ,Published On : March 13, 2020 / 10:26 AM IST
కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?

రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్  లాల్జీ టాండన్‌తో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో జరిగిన వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష బీజేపీ కుట్రలు పన్నుతోందంటూ మూడు పేజీల లేఖలో సీఎం కమల్ నాథ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను సవివరంగా ఆయన గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా 16నుంచి జరగుబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని సీఎం స్పష్టం చేశారు. బెంగళూరు రిసార్టుల్లో ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే రాష్ట్రానికి వచ్చేలా జోక్యం చేసుకోవాలని ఆయన గవర్నర్‌కు విన్నవించారు. దాదాపు గంటపాటు సాగిన వీరిద్దరి సమావేశం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీలో బల పరీక్ష ఎలా జరగుతుందని గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  అయితే కరోనా వైరస్ దృష్యా అసెంబ్లీ సమావేశాలు నిలుపుదలపై కమల్ నాథ్ ను ప్రశ్నించగా,అది తర్వాత చూద్దాం..ప్రస్తుతం రాజకీయాల్లో కరోనా వైరస్ ఉందన్నారు.  ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కమల్ నాథ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఆయన ఉన్నట్లు సమాచారం.

See Also | కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటే రూ.3.30 లక్షలు బహుమతి!

మరోవైపు మంగళవారం(మార్చి-10,2020) రాజీనామాలు చేసిన ఆరుగరు మంత్రులతో సహా 22మందిలో,13మందికి స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లేదా శనివారం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. చట్టం ప్రకారం రాజీనామాలు చేసే ఎమ్మెల్యేలు మొదటగా స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని,ఆ తర్వాత కేసు యొక్క యోగ్యత ప్రకారం నిర్ణయించే ముందు స్పీకర్ అందుబాటులో ఉన్న సాక్ష్యాలను లేదా వాస్తవాలను పరిశీలిస్తారని స్పీకర్ ప్రజాపతి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేజారిపోకుండా కాంగ్రెస్,బీజేపీలు జాగ్రత్త పడ్డాయి. కాంగ్రెస్ 94మంది ఎమ్మెల్యేలను జైపూర్ కి తరలించగా,బీజేపీ  తమ 102మంది ఎమ్మెల్యేలను గురుగావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తరలించింది.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 116గా ఉంది. ఒకవేళ 22మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే మెజార్టీ మార్క్ 104గా ఉంది. ప్రస్తుతం బీజేపీ దగ్గర 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బకవేళ బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 22మంది రెబల్ ఎమ్మెల్యేలు అందరూ రెండు రోజుల క్రితం 18ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందినవారే.

See Also | ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!