భారత్ లో కరోనా రాకాసి : 24 గంటలు..కొత్త 896 కేసులు..37 మరణాలు

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 02:10 AM IST
భారత్ లో కరోనా రాకాసి : 24 గంటలు..కొత్త 896 కేసులు..37 మరణాలు

భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 896 కేసులు, 37 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 6 వేల 761కి చేరింది.

ఇందులో 6వేల 39 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 206మంది మరణించారు.  516మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే… ఇప్పటివరకు దేశంలో నిన్న నమోదైన కేసులే అత్యధికమని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు అక్కడ నమోదవుతున్నాయి. ఏరోజుకారోజు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అదుపులోకి రావడంలేదు. తాజాగా అక్కడ రెండు వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1574కు పెరిగింది. నిన్న మరో 13మంది మృతిచెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం మృతుల సంఖ్య 110కి చేరింది. ఇప్పటివరకు 188మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా… ప్రస్తుతం 1276 మంది చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా ధాటికి ముంబై నగరం విలవిలలాడుతోంది. నగరంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ముంబైలో నిన్నఒక్కరోజే కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న మరో 10 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 64కు చేరింది. మరోవైపు సిటీలోని పలు ప్రాంతాలను ఇప్పటికే కరోనా హాట్స్పాట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.(భయపెట్టిన రూ. 500 నోట్లు…కారణం ఏంటో తెలుసా)

కరోనా మహమ్మారి తమిళనాడులోనూ కలకలం రేపుతోంది. ఆ రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి గత మూడ్రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న కొత్తగా మరో 77 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 911కు చేరింది.  దేశంలో రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల సంఖ్యపరంగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అయితే… ఇక్కడ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోని మర్కజ్ కు హాజరైనవారే ఉన్నారు. బాధితుల్లో 44 మంది ఇప్పటికే కరోనా బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవగా.. 9 మంది చనిపోయారు. 

మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఢిల్లీ అత్యధిక కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 183 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 903కి చేరింది. నిన్న మరో ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 14కి పెరిగింది. ఢిల్లీలో ఇప్పటివరకు 27 మంది కోలుకున్నారు. మరోవైపు.. తాజా కేసులతో ఢిల్లీ ప్రభుత్వ మరింత అప్రమత్తమైంది. మరో ఆరు కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఆ ప్రాంతాలను సీల్ చేసింది. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆ ప్రాంతాల ప్రజలను బయటకు వెళ్లనీయడం లేదు. దాంతో ఢిల్లీలో మొత్తం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 30కి చేరింది.

ఉత్తరప్రదేశ్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న కొత్తగా మరో 23 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు యూపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 433కి చేరింది. వారిలో 225 మంది గత నెల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు హాజరైన వారేనని అధికారులు తెలిపారు. కాగా… కోవిడ్-19 కారణంగా యూపీలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు. వారిలో మీరట్, బస్తి, వారణాసి, ఆగ్రా ప్రాంతాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.