దేశంలో 50వేల కరోనా మరణాలు.. 26 లక్షలు దాటిన కేసులు

  • Published By: vamsi ,Published On : August 17, 2020 / 10:44 AM IST
దేశంలో 50వేల కరోనా మరణాలు.. 26 లక్షలు దాటిన కేసులు

భారతదేశంలో 26 లక్షలకు పైగా ప్రజలు ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 51 వేల మంది చనిపోయారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57,981 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 941 మంది మరణించారు.



భారత్ తర్వాత ఎక్కువ కేసులు అమెరికా, బ్రెజిల్‌లలో నమోదు అవుతూ ఉండగా వరుసగా గత 24గంటలల్లో 36,843, 22,365 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 522, 582 మరణాలు సంభవించాయి. ఆగస్టు 13 న భారతదేశంలో రికార్డు స్థాయిలో 66,999 కేసులు నమోదయ్యాయి.



ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 26 లక్షల 47 వేల 663 మందికి కరోనా సోకింది. వీరిలో 50,921 మంది చనిపోగా, 6 లక్షల 76వేల మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక 19 లక్షల 19 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.



1.92% కి పడిపోయిన మరణాల రేటు:
దేశంలో మరణాల రేటుతో పాటు క్రియాశీల కేసుల రేటు తగ్గడం ఉపశమనం కలిగించే విషయం. దేశంలో మరణాల రేటు 1.92 శాతానికి పడిపోయింది. ఇది కాకుండా, చికిత్స పొందుతున్న క్రియాశీల కేసుల రేటు కూడా 25.56% కి పడిపోయింది. దీనితో, రికవరీ రేటు 72.51% గా మారింది. భారతదేశంలో రికవరీ రేటు నిరంతరం పెరుగుతోంది.

క్రియాశీల కేసుల విషయంలో టాప్ -5 రాష్ట్ర గణాంకాల ప్రకారం, దేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో 1.5 లక్షలకు పైగా కరోనా సోకినవారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, కర్ణాటక నాలుగవ స్థానంలో, ఢిల్లీ ఐదవ స్థానంలో ఉన్నాయి.



భారతదేశంలో 156 రోజుల్లో 50 వేల మరణాలు
అమెరికాలోని కరోనా నుండి మరణించిన వారి సంఖ్య 50 వేలకు చేరుకోవడానికి 23 రోజులు పట్టగా.., బ్రెజిల్‌లో 95 రోజులు, మెక్సికోలో 141 రోజులు, భారతదేశంలో 156 రోజులు పట్టిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో మరణాల రేటు 1.93 శాతం, ఇది ప్రపంచ సగటు కంటే తక్కువ. కరోనా కారణంగా యుఎస్‌లో మరణాల రేటు 3.19 శాతం, బ్రెజిల్‌లో 3.33 శాతం, మెక్సికోలో 10.89 శాతం, బ్రిటన్‌లో ఇది 14.98 శాతంగా ఉంది.

తీవ్రమైన వ్యాధుల కారణంగా 70 శాతం మరణాలు:
కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించిన వారిలో 70 శాతం మంది ఇప్పటికే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.