Coronavirus India Live Update: బాబోయ్.. ఒక్కరోజే 714మంది మృతి, 90వేలకు దగ్గరగా కొత్త కేసులు.. ఇండియాలో కరోనా కల్లోలం..

Coronavirus India Live Update: బాబోయ్.. ఒక్కరోజే 714మంది మృతి, 90వేలకు దగ్గరగా కొత్త కేసులు.. ఇండియాలో కరోనా కల్లోలం..

Corona India

Coronavirus India Live Update: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 714 మంది ప్రాణాలను కరోనా బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సంఖ్య నిన్న(ఏప్రిల్ 2,2021) భారీగా పెరిగి, పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. ఇప్పటివరకు 1,64,110 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. నిన్న 10,46,605 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 89వేల 129 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది. ప్రస్తుతం దేశంలో సెప్టెంబర్ చివరినాటి విజృంభణ కనిపిస్తోంది.

భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు:
కొద్ది వారాలుగా కరోనా విజృంభిస్తుండటంతో.. యాక్టివ్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 6లక్షల 58వేల 909 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో 1.25 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసుల రేటు.. ఇప్పుడు 5 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. ఇక, నిన్న 44వేల 202 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్నటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1.15కోట్లకు పైబడగా.. ఆ రేటు 93.68 శాతానికి చేరింది. రికవరీలు మెరుగ్గా ఉండటమే కాస్త ఊరటనిచ్చే విషయం.

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కంటిన్యూ అవుతోంది. లాక్‌డౌన్ తప్పని పరిస్థితులను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో సగానికిపైగా వాటా మహారాష్ట్రదే కావడం గమనార్హం. అక్కడ నిన్న ఏకంగా 47వేల 913 కొత్త కేసులు వెలుగుచూడగా..481 మంది బలయ్యారు. నిన్నటివరకు 29లక్షల 04వేల 076 మందికి వైరస్ సోకగా..55వేల 379 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే యాక్టివ్ కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 24లక్షల 57వేల 494 మంది కోలుకున్నారు.

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ఆందోళనకర రీతిలో కొత్త కేసులు:
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం(ఏప్రిల్ 2,2021) 59వేల 705 కరోనా పరీక్షలు నిర్వహించగా..1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 7వేలకు(6వేల 900) చేరువైంది.

ఒక్క జీహెచ్ఎంసీలోనే 283 కేసులు:
కరోనాతో మరో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,712కి చేరింది. నిన్న 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 283 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కరోనా తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ శనివారం(ఏప్రిల్ 3,2021) బులిటెన్‌లో తెలిపింది.

ఏపీలో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31వేల 116 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,288 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,04,548 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం (ఏప్రిల్ 2,2021) వెల్లడించింది.

7వేలు దాటిన మరణాలు:
గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ వల్ల అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,225కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో 610 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,88,508కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

9వేలకు చేరువలో యాక్టివ్ కేసులు:
ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా కేసులు పెరగడంతో పాటు డిశ్చార్జి కేసులు తగ్గడంతో యాక్టివ్ కేసులు భారీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,46,104 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. శుక్రవారం(ఏప్రిల్ 2,2021) గుంటూరులో అత్యధికంగా 311, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,288 మొత్తం కోవిడ్‌ కేసుల్లో 1,009 (78 శాతం) కేసులు కేవలం 5 జిల్లాల్లోనే(గుంటూరు-311, చిత్తూరు-225, విశాఖ-191, క్రిష్ణా-164, నెల్లూరు-118) నమోదు కావడం గమనార్హం.