మాస్క్ లతో కరోనా కమెండోలు..సూపర్ స్ప్రెడర్లను గుర్తించడానికి కమెండోలు

  • Published By: nagamani ,Published On : July 9, 2020 / 03:42 PM IST
మాస్క్ లతో కరోనా కమెండోలు..సూపర్ స్ప్రెడర్లను గుర్తించడానికి కమెండోలు

కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి చర్యలను పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతోఎక్కడ చూసినా కమాండోల గస్తీ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో కరోనా కేసులు పెరిగాయి. పుంథూరా ప్రాంతంలో 600 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఏకంగా 119 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి ఆరుగురికిలో ఒకరికి కరోనా సోకిందని తేలింది. దీనికి తోడు పాజిటివ్ వచ్చిన ఓ మత్స్యకారుడికి ఇటీవల 120 మందిని కలిశాడని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో పరీక్షలను పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నట్టు కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసు విభాగానికి చెందిన 25 మంది కమాండోలను రంగంలోకి దించారు. పుంథూరా నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. నిత్యావసరాలను కూడా నేరుగా అధికారులే సరఫరా చేస్తున్నారు. పుంథూరా, తమిళనాడు మధ్య ఫిషింగ్ బోట్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.

కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో అవసరమైనన్ని పడకలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చినవారిని తక్షణమే హాస్పిటల్‌కు తరలిస్తున్నట్టు మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,559 మంది కోలుకున్న సంగతి తెలిసిందే.