రండమ్మా..రండీ..చీర కొంటే ‘కరోనా కిట్ ఫ్రీ’..కరోనా కాలంలో ట్రెండ్లీ బిజినెస్ 

  • Published By: nagamani ,Published On : June 18, 2020 / 04:26 AM IST
రండమ్మా..రండీ..చీర కొంటే ‘కరోనా కిట్ ఫ్రీ’..కరోనా కాలంలో ట్రెండ్లీ బిజినెస్ 

వ్యాపారస్తులు కష్టమర్లను ఆకట్టుకోవటానికి రకరకాల ఆఫర్లను ఇస్తుంటారు. ముఖ్యంగా బట్టల వ్యాపారులు మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుంటారు. చీర కొంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటారు. కానీ ఈ కరోనా కాలంలో వ్యాపారులు ట్రెండ్ మార్చేశారు. కరోనా కాలంలో వచ్చిన మార్పులు తప్పదు కదా..అందుకే బట్టల వ్యాపారులు రండమ్మా..రండీ..చీర కొనుక్కోండి ‘‘కరోనా కిట్’’ ఫ్రీగా పట్టుకెళ్లండీ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. 

లాక్ డౌన్ తో ఎన్నో వ్యాపారాలు కుదేలైపోయిన విషయం తెలిసిందే. ఐదవ దశ లాక్ డౌన్ లో షాపులు తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా కూడా పెద్దగా జనాలు షాపింగ్ చేయడం లేదు. కారణం కరోనా కష్టకాలం. మూడు నెలలపాటు ఏపనీలేక చేతిలో ఉన్న డబ్బులు కాస్తా అయిపోవటంతో చాలా పొదుపుగా రోజులు గడుపుకునే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు.

ముఖ్యంగా మధ్యతరగతి..దిగువమధ్యతరగతి..పేదవాళ్లు ఇలా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో షాపులు ఓపెన్ అయినా పెద్దగా బేరాల్లేక వ్యాపారులు ఊగలు తోలుకునే పరిస్థితి. అలాగే బట్టల వ్యాపారుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో సూరత్ లోని బట్టల వ్యాపారులు చీర కొంటే కరోనా కిట్ ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

ఈ కరోనా కిట్ లో శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు వంటివి ఉన్నాయి. కరోనా వైరస్ రాకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వ్యాపారాలు చెబుతున్నారు.

‘కరోనా కవచం’ పేరుతో ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. రూ.500 నుంచి రూ.5000 వరకు ఖరీదు ఉండే చీరలను కొంటే ‘కరోనా కవచం’ బాక్సును ఫ్రీగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ ప్రకటించిన తరువాత యూపీ, రాజస్థాన్, బీహార్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు.  

Read: #BoycottChina : చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. స్వదేశీ వస్తువులను వాడదాం