కరోనా ఎఫెక్ట్: ఈఎమ్‌ఐలు ఎలా? కేంద్రానికి వినతులు!

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 01:28 AM IST
కరోనా ఎఫెక్ట్: ఈఎమ్‌ఐలు ఎలా? కేంద్రానికి వినతులు!

దశాబ్దాలు కాలంగా మానవాళి ఎప్పుడూ ఎరగని పరిస్థితి. దేశంలో అయితే ఇటువంటి పరిస్థితి ఊహించనే లేదు. ఇప్పటికే కరోనా తెచ్చిన తలనొప్పులు ఒకటో రెండో కాదు.. కోకొల్లలు.. దీంతో దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇటువంటి పరిస్థితిలో ఓవైపు సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. రోజువారీ కూలీలు.. పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఏం తినాలన్నా కష్టమే అయిపోయింది.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఇప్పటికే నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే నెలాఖరుకు రాగానే ఇప్పడు సగటు సామాన్య, మధ్యతరగతి వ్యక్తి మదిలో మెదిలే ఆలోచన ఏంటీ? అంటే.. ‘ఈఎమ్‌ఐ’. అవును బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని నెల నెలా కట్టే ఈఎమ్ఐలు ఈ వారంలోనో… లేకపోతే వచ్చే నెల మొదటివారంలోనో వచ్చేస్తాయి. అవి వచ్చేశాయి అంటే.. అందరిలోనూ టెన్షన్.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ నెలంతా పనులు లేవు.. నెలవారి జీతగాళ్లకు డబ్బులు వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో చేతుల్లో డబ్బులు ఉంటే మంచిది అనుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి సగటు జీవి కేంద్రాన్ని కోరుతున్న ఒకే ఒక్క కోరిక.. ‘ఒక్క నెల ఈఎమ్‌ఐల మినహాయింపు’.

అంటే పూర్తిగా తీసెయ్యమని కూడా కాదు.. ఈ నెల కట్టాల్సిన ఈఎమ్ఐలను చివరి ఈఎమ్‌ఐలుగా వాయిదా వేయించి వచ్చే నెల కంటన్యూ చేయించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ‘‘వారం కాదు నెల రోజులు ఇంట్లో ఉంటాం.. దేశం కోసం బయటకు రాకుండా…కానీ ఒక్క నెల ఈఎంఐలు ఆపండి మోదీగారు’ అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే.. అర్థం చేసుకోవచ్చు. గృహాలు, గృహోపకరణాలు, వాహనాల, బ్యాంకు పర్సనల్ లోన్ ఈఎంఐ రీషెడ్యూల్ చేస్తే కొందరికి ఉపశమనం దక్కుతుంది. అనేది వారి అభిప్రాయం.

ఇతర దేశాల్లో ముఖ్యంగా లండన్, సింగపూర్ వంటి దేశాల్లో కోన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బ్రిటన్‌లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ ల్యాండ్ వంటి బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. కరోనా వైరస్ కారణంగా ప్రభావితమైన కస్టమర్లు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు కూడా. 

See Also | ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట వద్ద అర్ధరాత్రి హైడ్రామా