ఒకేరోజు 10వేల కరోనా కేసులు: ఉపశమనం.. ఆందోళన.. నాల్గవ స్థానంలోకి ఇండియా

  • Published By: vamsi ,Published On : June 12, 2020 / 05:39 AM IST
ఒకేరోజు 10వేల కరోనా కేసులు: ఉపశమనం.. ఆందోళన.. నాల్గవ స్థానంలోకి ఇండియా

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో కొంతవరకు విజయం సాధించింది భారత్. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య చురుకైన కేసులను మించిపోవడం కాస్త ఉపశమనం కలిగించే వార్త. 

ఇప్పటివరకు, కరోనా వైరస్ సోకిన 1,47,195 మంది రోగులు పూర్తిగా ఆరోగ్యంగా మారిపోయి ఇంటికి వెళ్ళారు. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1,41,842గా ఉంది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,535కు చేరుకున్నది.

ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2.97 లక్షలకు, మరణాల సంఖ్య 8,498 కు చేరుకోగా.. కరోనా కేసుల విషయంలో ఇండియా, బ్రిటన్‌ను కూడా దాటేసింది. అత్యధిక కేసులున్న దేశాల్లో ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకింది ఇండియా. తొలి స్థానంలో 20 లక్షలకు పైగా కేసులతో అమెరికా ఉండగా, ఆ తరువాత  బ్రెజిల్‌లో 7.72 లక్షల కేసులు, రష్యాలో 4.93 లక్షల కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం బ్రిటన్ లో ఇండియాకన్నా తక్కువగా 2,91,588 కేసులు ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ ను అమలు చేసిన ఇండియా, తొలుత వైరస్‌ను చాలా వరకూ అడ్డుకుంటున్నట్టే కనిపించింది. కానీ ఒకే రోజు 10వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఒక్క రోజే 10956 కేసులు రికార్డు అవగా.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్‌ వల్ల 396మంది చనిపోయారు. 

మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజే 3607 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 152 మంది చనిపోయారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో 97648 కేసులు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రం పాజిటివ్‌ కేసుల విషయంలో కెనడాను దాటేసింది. మహారాష్ట్రలో 46078 మంది కోలుకోగా.. ఒక్క ముంబైలోనే 54,085 కేసులు ఉన్నాయి. ఆ సిటీలో ఇప్పటివరకు 1954 మంది చనిపోయారు. 

Read: ఢిల్లీలో కరోనా కల్లోలం : ఉమ్మి గొడవ..ఒకరు మృతి