Coronavirus Restrictions: ముంచుకొస్తున్న మహమ్మారి.. వారాల తరబడి లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు!!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ చెలరేగుతుంది. ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం ఆందోళన పుట్టిస్తోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదు కావడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది.

Coronavirus Restrictions: ముంచుకొస్తున్న మహమ్మారి.. వారాల తరబడి లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు!!

Statewise Lockdowns

Coronavirus Restrictions: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ చెలరేగుతుంది. ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం ఆందోళన పుట్టిస్తోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదు కావడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. 24 గంటల్లో 43వేల 846 మంది వైరస్‌‌కు ఎఫెక్ట్ అయ్యారు. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం. తెలంగాణకు పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో 27వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

వైరస్‌ ఉధృతమవుతోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ మొదలుపెట్టేశాయి. మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలవుతోంది. రాజస్థాన్‌లోని 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూను సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌, జబల్‌పుర్‌లో వారాంతపు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. అమృత్‌సర్‌ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు పంజాబ్‌ ప్రకటించింది.

దేశంలో తాజాగా కొవిడ్‌ కారణంగా మరో 197 మంది మృతి చెందారు. ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య కోటి 15లక్షల 99వేల 130కి, మొత్తం మరణాలు లక్షా 59వేల 755కి పెరిగాయి. 22వేల 956 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య కోటి 11లక్షల 30వేల 288కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3లక్షల 9వేల 87 క్రియాశీల కేసులు ఉండటంతో ఆ రేటు 2.66 శాతంగా ఉంది.

ఆ రాష్ట్రాల్లో 83 శాతం కేసులు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల వాటా 83.14 శాతంగా ఉంది. 24 గంటల్లో మహారాష్ట్రలో 27వేల 126 కేసులు రాగా.. 92 మంది మృతి చెందారు. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత పంజాబ్‌ (2వేల 578), కేరళ(2వేల 78) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గోవాలోని ఒక అనాథ ఆశ్రమంలో 18 మందికి వైరస్‌ సోకడంతో ఆ ప్రాంతాన్ని మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించారు.

వారాంతపు లాక్‌డౌన్
మధ్యప్రదేశ్‌లో భోపాల్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కళాశాలలు, పాఠశాలలకు నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది.

తమిళనాడులో మార్చి 22 నుంచి.. 9, 10, 11 తరగతులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమృత్‌సర్‌ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాజస్థాన్ లోని ఎనిమిది నగరాల్లో రాత్రి పూట్ కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అమలులో ఉంటుందని వెల్లడించారు.