కరోనా భయం, కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 03:56 AM IST
కరోనా భయం, కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో కరోనా అటాక్ చేస్తుందో తెలియక హడలిపోతున్నారు. ఆ కరోనా భయమే తాజాగా కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేసేలా చేసింది.

రోడ్డుపై వెళ్తున్న సమయంలో నోటు కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? మూడో కంటికి తెలియకుండా వెంటనే తీసుకుని జేబులో దాచేస్తాం. ఎవరైనా ఇలానే చేస్తారు. కానీ ఇది గతం. ఇప్పుడు మాత్రం సీన్ మరోలా ఉంది. కరోనా వైరస్‌ ధనాశను కూడా చంపేస్తోంది. రోడ్డుపై పడిన నోట్లను ప్రజలు తీసుకోవడం లేదు. అంతేకాదు వాటిని కాల్చి బూడిద చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కర్నాటక రాష్ట్రం  కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై కనిపించిన కరెన్సీ నోట్లను స్థానికులు గమనించారు. అయితే వాటిని తీసుకోలేదు. అంతేకాదు వాటిని కాల్చి బూడిద చేశారు.

ముఖానికి మాస్క్‌ వేసుకొని వచ్చిన ముగ్గురు వ్యక్తులు కొంతసేపు మొబైల్‌లో మాట్లాడి, ఆ తరువాత నోట్లు పారవేసి వెళ్లినట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. వాటిని పిల్లలు ఎవరూ ముట్టకుండా మట్టితో మూసేశారు. ఆ తరువాత గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి నోట్లను తీసి కాల్చివేశారు. ఎవరో ఉమ్మివేసి రోడ్డుపై నోటు పారవేసినట్లు అనుమానం రావడంతో ఆ నోట్లను ముట్టకుండా కట్టెలతో పేర్చి మరీ కాల్చేశారు.