కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 05:53 PM IST
కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు

కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం, కోర్టులు కూడా తాత్కాలికంగా మూసివేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరగిపోయాయి. ఈ క్రమంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు జైలులో ఉండే ఖైదీలు. లేటెస్ట్‌గా కోల్‌కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. తమను బయటికి పంపించాలని, లేకపోతే కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందంటూ అధికారులను కోరారు.

అయితే అందుకు నిరాకరించిన జైలు అధికారులు.. కొందరు ఖైదీలను మాత్రం పదేళ్లకు పైగా జైల్లో గడిపి సత్ప్రవర్తన మరియూ కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇచ్చి వారిని బయటకు పంపారు. ఇది రుచించని మిగిలిన ఖైదీలు జైలుకు నిప్పు పెట్టారు. దీంతో జైలులో మంటలు చెలరేగగా.. కొందరు జైలు అధికారులపై ఖైదీలు దాడికి దిగారు.  దీంతో ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. 

ఖైదీలు భద్రతా దళాలపై దాడి చేయడంతో పలువురు పోలీసు సిబ్బంది, ఖైదీలు గాయపడ్డారు. ఖైదీలు తప్పించుకునేందుకు జైలు గోడలను పడగొట్టడానికి ప్రయత్నించారు. కరోనా వ్యాధి వ్యాప్తికి వ్యతిరేకంగా నివారణ చర్యల్లో భాగంగా మార్చి 31వ తేదీ వరకు ఖైదీలను వారి కుటుంబ సభ్యులతో కలవడాన్ని అధికారులు నిషేధించారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనాని మహమ్మారిగా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆందోళనకు గురైన ఖైదీలు గార్డులను ఇటుకతో కొట్టడం మరియు ఎత్తైన జైలు గోడలలో కొంత భాగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. కొంతమంది పోలీసు సిబ్బంది తలలు పగలగా.. హింసను నియంత్రించడానికి పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి.