అండమాన్‌లో ఆదిమ తెగ‌ల‌కి సోకిన‌ క‌రోనా వైర‌స్‌

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2020 / 03:15 PM IST
అండమాన్‌లో ఆదిమ తెగ‌ల‌కి సోకిన‌ క‌రోనా వైర‌స్‌

అండమాన్ అండ్ నికోబర్ ‌దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగ‌ల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. అంత‌రించే ద‌శ‌లో ఉన్న గ్రేట‌ర్ అండ‌మానీస్ తెగ‌ వ్య‌క్తుల‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గ‌త వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.



గ్రేట‌ర్ అండ‌మానీస్ తెగ జ‌నాభా కేవ‌లం 53 మంది మాత్ర‌మే. స్ట్రెయిట్‌ ఐలాండ్‌లో ఉంటున్న ఈ 53మంది గ్రేటర్ అండమానీ స్ ‌ జాతి ప్రజలకు టెస్టులు నిర్వహిచామని అండమాన్ మరియు నికోబార్ దీవులలోని కోవిడ్ -19 యొక్క నోడల్ అధికారి అవిజిత్ రాయ్ తెలిపారు. ఆరోగ్యశాఖ సిబ్బంది పడవల మీద వెళ్లి ఒక రోజులు అందరికీ టెస్టులు నిర్వహించారు. వారు మాకు చాలా సహకరించారని అవిజిత్ రాయ్‌ తెలిపారు. .
https://10tv.in/first-look-of-john-abraham-and-aditirao-hydari-from-a-cross-border-love-story/
వారికి రోగ లక్షణాలు లేవు,. వాళ్ళు ప్రస్తుతం బాగానే ఉన్నారు. మేము వారిని పోర్ట్ బ్లెయిర్ కు తరలించి ఆసుపత్రిలోని ప్రత్యేక విభాగంలో ఐసొలేషన్ లో ఉంచాం అని రాయ్ తెలిపారు. విసిరేనట్లు దూరంగా ఉన్న ఈ దీవి నుంచి ఆ తెగకు చెందిన వారు తరచూ పోర్ట్ బ్లేయర్‌కు వస్తుంటారు. వీరిలో కొందరు అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ రాకపోకల వల్లే వారికి కోవిడ్‌-19 సోకి ఉంటుందని డాక్టర్‌ రాయ్‌ అన్నారు. అండమాన్‌ నికోబార్‌ ప్రాంతంలోని మిగతా ద్వీపాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమే ఇప్పుడు తమ లక్ష్యమని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు. ఈ దీవులకు రాకపోకలు, టెస్టుల మీద మేం దృష్టి పెట్టాం అని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు.



ప్రస్తుతం అండమాన్‌లో అంతరించిపోయే దశలో ఉన్న జరవా, నార్త్‌ సెంటినెలీస్‌, గ్రేటర్‌ అండమనీస్‌, ఒంజే, షోంపెన్‌ అనే ఐదు ఆదిమ తెగలు ఉన్నాయి. దీంట్లో జరవా, సెంటినెలీస్‌ తెగ ప్రజలు సాధారణ జనజీవనంలో కలిసిపోలేదు. నార్త్‌ సెంటినెలీస్‌ తెగవారు తమ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వరు. 2018లో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన ఒక అమెరికా పౌరుడిని ఆ తెగ ప్రజలు బాణాలతో కొట్టి చంపిన విషయం తెలిసిందే.

476 మంది సభ్యులున్న జారవా తెగ ప్రజలు మధ్య అండమాన్‌ ప్రాంతంలోని అడవులలో జీవిస్తుంటారు. వైరస్‌ వ్యాప్తి గురించి తెలియగానే వారిని అడవులలో మరింత లోపలికి పంపించి వేశామని అధికారులు తెలిపారు. అండమాన్‌ నికోబార్‌లోని 400 గ్రామాలకు లింకుగా పని చేస్తున్న అండమాన్‌ ట్రంక్‌ రోడ్‌ ఈ అడవుల గుండానే వెళుతుంది. ప్రజలు అటు ఇటూ ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉందని, వారికి ఈ వైరస్‌ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.



115 మంది సభ్యులున్న ఒంజే తెగవారి కోసం ఒక వైద్య బృందాన్ని పంపామని డాక్టర్‌ అవిజిత్‌ రాయ్‌ తెలిపారు. షోంపెన్‌ తెగవారికి కూడా పరీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. తమ దీవుల నుంచి బయటకు వెళ్లేవారికి టెస్టులు నిర్వహించాకే అనుమతిస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేలా నిబంధనలు విధిస్తున్నారు.

అండమాన్‌లోని ఇప్పటి వరకు 10 దీవులలో కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించామని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు. కోవిడ్‌-19 ట్రీట్‌మెంట్ కోసం రెండు ఆసుపత్రులు, మూడు హెల్త్‌ సెంటర్లు, పది కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌మాన్ నీకోబార్ దీవుల్లో మొత్తం 2985 కోవిడ్‌19 కేసులు న‌మోదు అయ్యాయి. 41 మ‌ర‌ణాలు సంభవించాయి.