డబ్బులివ్వకుండా తరిమేసిన యజమాని….ఫుడ్ లేకుండా 100కిలోమీటర్లు నడిచిన 8నెలల గర్భిణీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 02:03 PM IST
డబ్బులివ్వకుండా తరిమేసిన యజమాని….ఫుడ్ లేకుండా 100కిలోమీటర్లు నడిచిన 8నెలల గర్భిణీ

కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంతరంగా పనిలోనుంచి తీసేయడం,వసతి కల్పించకపోవడంతో ఆహారం దొరక్క అలమటించిపోతున్నారు. ఉన్న ఊళ్లో పనుల్లేక..చేతిలో చిల్లిగవ్వలేక…ఉండేందుకు వసతి లేక చాలామంది వలస కార్మికులు సొంత ఊరు వెళ్లలేక ఇబ్బందులెదుర్కొంటున్నారు.

 రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దేశంలోని చాలా చోట్ల ప్రజలు కాలినడకన స్వగ్రామాలకు పయనమవుతున్నారు. వందల కీలోమీటర్లు రోజుల తరబడి నడుస్తున్నారు. అప్పుడప్పుడు దారిమధ్యలో పోలీసుల దెబ్బలు కూడా తింటున్నారు. అయితే  అలా ఉన్నపళంగా ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో ఆహారం లేకుండా ఎనిమిది నెలల గర్భిణి భర్తతో కలసి వంద కిలోమీటర్లకు పైగా నడిచిన విషాద సంఘటన ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్‌ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే వకీల్ అనే వ్యక్తిని ఆ ఫ్యాక్టరీ ఓనర్ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఉంటున్న రూమ్ ని ఖాళీ చేయాలని ఆదేశించాడు. వకీల్ సొంతూరుకు వెళ్లేందుకు ఒక్కరూపాయి కూడా ఫ్యాక్టరీ ఓనర్ ఇవ్వలేదు.  దీంతో వేరే ఆప్షన్ లేక వకీల్…ఎనిమిది నెలల గర్బవతి అయిప తన భార్య యాస్మీన్‌‌తో కలిసి గత గురువారం(మార్చి-26,2020) 190కిలోమీటర్ల దూరంంలోని స్వగ్రామానికి పయనమయ్యాడు. లాక్‌డౌన్ కారణంగా రోడ్డుపై ఎలాంటి హోటల్స్ లేకపోవడంతో రెండు రోజులుగా భోజనం చేయకుండా నడుస్తూనే ఉన్నారు.

అలా సుమారు వంద కిలోమీటర్లు నడిచి శనివారం(మార్చి-28,2020) మీరట్‌ లోని సొహ్రాబ్ గేట్ బస్టాండ్‌ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి మరో వంద కిలోమీటర్లకు వరకు నడవాల్సి ఉంది. ఆహారం లేక నీరస పడిపోయిన గర్భిణిని చూసిన స్థానికులు నవీన్ కుమార్, రవీంద్ర ఆరా తీశారు. ఎనిమిది నెలల గర్భంతో వంద కిలోమీటర్లు నడిచిన విషయం తెలుసుకుని చలించిపోయారు. వెంటనే వారికి ఆహారం అందించి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న పోలీసుల హృదయం కరిగిపోయింది. బులంద్ షహర్ జిల్లాలోని వారి స్వగ్రామం అమర్‌గఢ్ వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. స్థానికులు వారికి ఆహారం కొంత నగదు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదప్రజలకు ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దేశంలోని పేద ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా కేంద్రం ఇప్పటికే 1.7లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.

మరోవైపు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని ఆదివారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు,జిల్లాల మధ్య పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపింది.