వ్యాక్సిన్ సంబరాలు : స్టోరేజీ ఇలా..నిల్వ చేయడమే కీలకం

వ్యాక్సిన్ సంబరాలు : స్టోరేజీ ఇలా..నిల్వ చేయడమే కీలకం

Coronavirus Vaccination Drive : సంక్రాంతి పండగ సంబరాలు ముగియగానే కరోనా వ్యాక్సిన్ సంబరాలు మొదలు కానున్నాయి. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాధాన్యత క్రమంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ దిశగా కీలక అడుగు వేశామని మోదీ ట్వీట్ చేశారు. కరోనా కోరల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే దిశగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

వ్యాక్సిన్ డెలివరీ : –
వ్యాక్సిన్ డెలివరీ, మేనేజ్‌మెంట్‌ సిస్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలిదశలో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత 27 కోట్ల మంది 50ఏళ్ల పైబడిన వారు… ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్‌ చేస్తారు. భారత్‌ రూపొందించిన వ్యాక్సిన్ల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు వచూస్తోందన్నారు ప్రధాని మోదీ.

డ్రై రన్ సక్సెస్ : –
భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ లో కొన్ని రాష్ట్రాలలో సాఫ్ట్‌వేర్‌ కనెక్టివిటీ, బ్రాడ్‌బాండ్‌ వంటి సమస్యలు వచ్చాయి. మొత్తానికి డ్రైరన్ సక్సెస్‌ కావడంతో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టోరేజీ సెంటర్లకు వ్యాక్సిన్లు : –
ప్రతీ ముఖ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం మైనస్‌ 15 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక వాహనాల ద్వారా ఎయిర్‌పోర్టుకు తీసుకువస్తారు. ఇక్కడి నుంచి విమానాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 57 ప్రైమరీ స్టోర్‌ సెంటర్లకు వ్యాక్సిన్లను చేరుస్తారు. అక్కడి నుంచి రిఫ్రిజిరేషన్‌ సౌకర్యం ఉన్న వాహనాల ద్వారా ప్రాంతీయ వ్యాక్సిన్‌ సెంటర్లకు తరలిస్తారు. అక్కడ నుంచి ఇన్సులేటెడ్‌ వ్యాన్ల ద్వారా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఉన్న 666 స్టోరేజీ సెంటర్లకు వ్యాక్సిన్లు చేరుకుంటాయి. జిల్లా స్టోరేజీ కేంద్రాల నుంచి ఇన్సులేటెడ్‌ వ్యాన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల 555 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు చేరుకుంటాయి. అక్కడ నుంచి వ్యాక్సిన్ క్యారియర్ల ద్వారా సబ్‌ సెంటర్లు, ఇతర క్షేత్ర స్థాయిలోని కేంద్రాలకు చేరుస్తారు. ఇక్కడ అంతిమంగా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తారు. కనీసం 2 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటైన్‌ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు.