జనవరిలోనే వ్యాక్సినేషన్ ప్రారంభం…అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 06:20 PM IST
జనవరిలోనే  వ్యాక్సినేషన్ ప్రారంభం…అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు

Coronavirus vaccination in India may start in January భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి2021లో ప్రారంభమయ్యే అవకాశముందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. శనివారం ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న అదర్ పూనావాలా మాట్లాడుతూ…జ‌న‌వ‌రిలోనే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు.

ఈ నెలాఖ‌రు నాటికి త‌మ సంస్థ ఉత్పత్తి చేస్తోన్న ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భిస్తుంద‌ని పూనావాలా ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే, వ్యాక్సిన్ విస్తృతస్థాయి ఉపయోగానికి అవసరమైన లైనెన్స్ పొందేందుకు మరికొన్ని రోజులు పడుతుందన్నారు. కాగా, డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఆమోదం లభిస్తే..జనవరి 2021లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశమున్నట్లు తాము నమ్మకంతో ఉన్నామని తెలిపారు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ క‌ల్లా వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని ఆశిస్తున్నట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నాటికి దేశంలోని అంద‌రికీ సరిప‌డా వ్యాక్సిన్ డోసులు ల‌భ్య‌మై.. క‌రోనా మునుప‌టి రోజులు సాధ్య‌మ‌వుతాయ‌ని అద‌ర్ పూనావాలా చెప్పారు.

కాగా,ఆస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని పూణే లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే,డిసెంబర్-7న దేశంలో “కోవిషీల్డ్” అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి సీరమ్ ఇనిస్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)ప్రకారం..సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే 40మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసింది.

కాగా, సీరమ్ తో పాటుగా భారత్ బయోటెక్,ఫైజర్ కంపెనీ కూడా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డీజీసీఐకి దరఖాస్తు చేసుకోగా.. ఖచ్చితమైన డేటా లేని కారణగంగా సీరమ్,భారత్ బయోటెక్ సంస్థల కరోనా వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగ విజ్ణప్తిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)లోని నిపుణుల కమిటీ బుధవారం తిరస్కరించింది. ఖచ్చితమైన డేటా లేని కారణంగానే దరఖాస్తులని తిరస్కరించింది. వ్యాక్సిన్ సమర్థత,భద్రతపై ఈ రెండు ఔషధ సంస్థల నుంచి CDSCO మరిన్ని వివరాలు కోరింది.