Coronavirus vaccine update.. ఏ దేశం టీకా ఎంతవరకు వచ్చింది, భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, రష్యా ఏం కోరుకుంటోంది

  • Published By: naveen ,Published On : August 21, 2020 / 12:25 PM IST
Coronavirus vaccine update.. ఏ దేశం టీకా ఎంతవరకు వచ్చింది, భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, రష్యా ఏం కోరుకుంటోంది

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 150కి పైగా దేశాల్లో టీకాను అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్, బ్రిటన్, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాలు టీకా తయారీలో నిమగ్నం అయ్యాయి. 2021 నాటికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ తీసుకొస్తామని మోడర్నా, ఆస్ట్రాజెనెకా, పిఫిజర్ లాంటి కంపెనీలు అంచనా వేశాయి.



జర్మనీకి చెందిన బయోటెక్నాలజీ సంస్థ క్యూర్ వేక్, భారత్ కు చెందిన ఐసీఎంఆర్ మాత్రం టీకా విషయంలో తొందరపడటం లేదు. డిసెంబర్ చివరి నాటికి లేదా 2021 ఏడాది మధ్యలో వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. రష్యా మాత్రం ఆగస్టు చివరి నాటికే మార్కెట్ లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించింది. టీకాలు అభివృద్ధి చేసే పనిలో ఉన్న మోడర్నా, ఆస్ట్రాజెనెకా, బయోన్ టెక్, నోవాక్స్, సైనోవాక్, క్యాన్ సినో బయోలాజిక్స్, భారత్ బయోటెక్, ఇనోవియో సంస్థలు హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

రష్యన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అప్ డేట్, ఆగస్టు చివరికి నాటికి మార్కెట్ లోకి టీకా:
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం రష్యా. ఇప్పుడు మార్కెట్ లోకి తెచ్చే పనిలో ఉంది. స్పుత్నిక్ వీ పేరుతో రష్యా టీకా అభివృద్ధి చేసింది. తాము అభివృద్ధి చేసిన టీకా ఎంతో సురక్షితమైనది, ప్రభావవంతమైనది అని రష్యా అధికార వర్గాలు, సైంటిస్టులు ఇప్పటికే ప్రకటించుకున్నారు. రెండు నెలల పాటు తక్కువ స్థాయిలో హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించిన రష్యా వాటి ఫలితాలను కూడా వెల్లడించకుండానే టీకా అభివృద్ది చేసినట్టు చెప్పుకుంది. కాగా, విడ్ 19 టీకా ఉత్పత్తి విషయంలో భారత్ భాగస్వామి కావాలని రష్యా కోరుకుంటోంది.



టీకా కొనుగోలుకు ఒప్పందాలు:
ఈయూ దేశాలకు 225 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు యూరోపియన్ కమిషన్, జర్మన్ బయోటెక్ ఫర్మ్ క్యూర్ వ్యాక్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, సనోఫీ సంస్థలతో యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ చర్చలు జరుపుతున్నారు. ఆ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలను తమకు సరఫరా చేయాలని అడిగారు. అలాగే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా ఆధ్వర్యంలో తయారవుతున్న టీకాను(300 మిలియన్ డోసులు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు.

భారత్ లో ముగింపు దశలో ఫేజ్ 2 ట్రయల్స్:
ఇక భారత్ లో కరోనా టీకా అభివృద్ధిలో రెండు సంస్థలు ముందున్నాయి. అందులో ఒకటి భారత్ బయోటెక్ కాగా మరొకటి క్యాడిలా. ఈ రెండూ ప్రస్తుతం రెండో దశ హ్యుమన్ ట్రయల్స్ ముగింపు దశలో ఉన్నాయి.



ప్రజలందరికి ఉచితంగా టీకా:
తమ దేశ ప్రజలందరికి ఉచితంగా కరోనా టీకా ఇస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చెప్పారు. ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తుందని, ఉచితంగా టీకాను ప్రజలందరికి ఇస్తుందని ప్రకటించారు. టీకాను అభివృద్ధి చేశాక తమకు సప్లయ్ చేయాలని స్వీడిస్ బ్రిటీష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ చాలా అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది. ప్రపంచం మొత్తం వారి టీకాపై అనేక ఆశలు పెట్టుకుంది.

ఫేస్ 2, ఫేస్ 3 క్లినికల్ స్టడీ ప్రయత్నాల్లో సీరమ్:
భారత్ కు చెందిన సీరమ్, టీకా తయారీలో కీలకమైన రెండో, మూడో దశ ట్రయల్స్ నిర్వహించే పనిలో ఉంది. కరోనా టీకా కొవిషీల్డ్ ఎంతవరకు సురక్షితం అని తెలుసుకోవడానికి ఆరోగ్యవంతులైన భారతీయ వ్యక్తులపై ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తం 1600మందిపై ట్రయల్స్ చేయనున్నారు. వారంతా 18 ఏళ్లు అంతకు పైబడిన వారే. దేశంలోని 17 ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు.



Andhra Medical College (Visakhapatnam), JSS Academy of Higher Education and Research, (Mysore), Seth G. S. Medical College and KEM Hospital (Mumbai), KEM Hospital Research Centre (Vadu), B J Medical College and Sassoon General Hospital (Pune), All India Institute Of Medical Sciences (Jodhpur), Rajendra Memorial Research Institute of Medical Sciences, (Patna), Institute of Community Medicine ( Madras), Post Graduate Institute of Medical Education & Research (PGIMER), Bharati Vidyapeeth Deemed University Medical College and Hospital (Pune), Jehangir Hospital ( Pune), AIIMS (Delhi), ICMR- Regional Medical Research Centre ( Gorakhpur), TN Medical College & BYL Nair Hospital (Mumbai), Mahatma Gandhi Institute of Medical Sciences (Sewagram) and Government Medical College (Nagpur).

పాకిస్తాన్ లో చైనా కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్:
చైనాకు చెందిన కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ తమ దేశంలో నిర్వహించేందుు పాకిస్తాన్ డ్రగ్ రెగులేటరీ అథారిటీ అనుమతి ఇచ్చింది. చైనాకి చెందిన క్యాన్ సినో, బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ చైనా సంయుక్తంగా టీకాను అభివృద్ధి చేశాయి. దీని మూడో దశ ట్రయల్స్ పాకిస్తాన్ లో నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.

అక్టోబర్ లో ట్రయల్స్ ప్రారంభించినున్న ఇజ్రాయెల్ కంపెనీ:
ఇజ్రాయెల్ కు చెందిన రీసెర్చ్ సంస్థ టీకా అభివృద్ధి చేసే పనిలో ఉంది. రష్యా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ పని జరుగుతోంది. అక్టోబర్ లో హ్యుమన్ ట్రయల్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెవిష్ సెలవులు అక్టోబర్ లో ముగుస్తాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ ట్రయల్స్ నిర్వహించనుంది. గత ఆరు నెలలుగా టీకా తయారీలో ఈ సంస్థ నిమగ్నమైంది. మార్చిలో యానిమల్ ట్రయల్స్ ప్రారంభించింది.

ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ భారత్ లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. డిసెంబర్ 2020 నాటికి తొలి బ్యాచ్ డోసు టీకా అందుబాటులోకి వస్తుందన్నారు.