అవినీతి మన వ్యవస్థలో ఓ భాగం : మహారాష్ట్ర డీజీపీ

అవినీతి మన వ్యవస్థలో ఓ భాగం : మహారాష్ట్ర డీజీపీ

corruption మహారాష్ట్ర డీజీపీ హేమంత్‌ నాగ్రలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల నాగ్ పూర్ పర్యటనలో ఉన్న డీజీపీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలు,ఇతర ఇష్యూలపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా.. అవినీతి అనేది మన వ్యవస్థలో ఒక భాగమని, దానిని 100శాతం నిర్మూలించడం చాలా కష్టమని అన్నారు.

చట్టం ప్రకారం..అవినీతిని నిరోధించగలం కానీ మన వ్యవస్థ నుంచి దాన్ని పూర్తిగా రూపుమాపలేమన్నారు. తాను అవినీతిని సమర్ధించడం లేదని డీజీపీ చెప్పారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ కేసులను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు. తద్వారా అవినీతిని నియంత్రించడం సాధ్యమవుతుందని డీజీపీ హేమంత్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా కాలంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన వేల మెడికల్ సిబ్బంది,పోలీసులే బయటికొచ్చి ముందువరుసలో ఉండి ప్రతి ఒక్కరి భద్రత కోసం పనిచేశారని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా సోకి 339మంది మహారాష్ట్ర పోలీసులు చనిపోయారని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన పోలీసులపై ఆధారపడిన వాళ్ల కుటుంబంలోకి ఒకరికి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పారు.