హాంకాంగ్‌ ఫైనాన్స్ హబ్‌పై డ్రాగన్ దెబ్బ.. ముంబైకి కలిసొస్తుందా?

  • Published By: sreehari ,Published On : July 4, 2020 / 04:52 PM IST
హాంకాంగ్‌ ఫైనాన్స్ హబ్‌పై డ్రాగన్ దెబ్బ.. ముంబైకి కలిసొస్తుందా?

హాంకాంగ్ స్వయం నిర్ణయాధికారాన్ని చైనా అణచి వేసింది. ఆసియాలోనే అతి పెద్ద ఫైనాన్స్ హబ్ పై దెబ్బ పడింది. ఇప్పుడా స్థానాన్ని ముంబై భర్తీ చేస్తుందా? హాంకాంగ్‌లో ఉన్న ఫైనాన్స్ రంగం నిపుణులను ఇప్పుడు భయం వెంటాడుతోంది. ఫైనాన్స్ రంగంపై పరిశోధనలు, విశ్లేషణలు ఇకపై హాంకాంగ్‌లో సాధ్యం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకే ముంబై చర్చల్లోకి వచ్చింది. చైనా రోజూ వార్తల్లో ఉంటోంది. కరోనా నుంచి ఇది మొదలయ్యింది. ఆసియా, అమెరికా, ఐరోపా వరకు నిత్యం చైనా ప్రస్తావన వస్తూనే ఉంది. చైనా అహంకారమే ఇందుకు ప్రధాన కారణం. చైనా అనుసరిస్తున్న కొత్త సామ్రాజ్య వాదం దానికి ఆజ్యం పోస్తోంది. యాభయ్యేళ్ల పాటు హాంకాంగ్ కు స్వయం నిర్ణయాధికారం ఇస్తామని హామీ ఇచ్చింది చైనా. పాతికేళ్ళు కూడా పూర్తికాకుండానే మాట తప్పింది.

హాంకాంగ్ అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్ర్యాలను కబళించడానికి కొత్త జాతీయ భద్రతా చట్టం తెచ్చింది. దాంతో హాంకాంగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది . ప్రపంచ వ్యాపార కేంద్రంగా ఉన్న హాంకాంగ్ పై అనుమానపు నీలి నీడలు కమ్ముకున్నాయి. హాంకాంగ్ లో ఉన్న ఫైనాన్స్ మార్కెట్ అక్కడి నుంచి తరలి పోతుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ హాంకాంగ్ లో ఒక దేశం, రెండు విధానాలు అమలు చేస్తూ వచ్చింది చైనా. ఇకపై చైనా , హాంకాంగ్ లో ఒకే విధానం అమల్లో ఉంటుంది. అందుకే హాంకాంగ్ వాసులు పునరాలోచనలో పడ్డారు. స్వేచ్చా , స్వాతంత్ర్యాలు లేని చోట వ్యాపారాలు, ఫైనాన్స్ మార్కెట్లూ సేచ్ఛగా పనిచేయలేవు. ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉంటుంది. బీజింగ్ పెద్దలు ఎప్పుడు ఏంచేస్తారోనన్న ఆందోళన‌లో బతకాల్సి వస్తుంది. అలాంటి చోట ఫైనాన్స్ మార్కెట్లపై విశ్లేషణలు కూడా స్వేచ్ఛగా సాగవు.

జూన్ నెలాఖరు నుంచి హాంకాంగ్ లో చైనా జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై హాంకాంగ్ వాసులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలూ వెల్లడించడం నేరం. చైనా పాలకులకు నచ్చని పని ఏది చేసిన జైలు శిక్ష ఖాయం. 1997లో హాంకాంగ్ బ్రిటన్ వలస పాలన నుంచి చైనా అధీనం లోకి వచ్చింది. హాంకాంగ్ ప్రజలకు యాభైయ్యేళ్ల పాటు ప్రజాస్వామిక హక్కులుంటాయని చైనా ఆనాడు హామీ ఇచ్చింది. ఇప్పుడు హాంకాంగ్ ను డ్రాగన్ కొట్టిన దెబ్బతో ప్రపంచం విస్తుపోయింది.

దీనికి వ్యతిరేకంగా తిరిగి హాంకాంగ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. అరెస్టులు మొదలయ్యాయి. దాంతో హాంకాంగ్ లో ఉన్న ఫైనాన్స్ వృత్తి నిపుణులు నిస్పృహలోకి జారిపోయారు. రెండు దశాబ్దాలకు పైగా వాళ్ళక్కడ స్వేచ్ఛగా బతికారు . చైనా అద్భుత ఆర్ధిక విజయం పై వాళ్ళు చేస్తున్న పరిశోధనలు , విశ్లేషణలూ ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. ఇకపై ఆ పని కష్టం కావచ్చన్న భయం వాళ్ళను వెంటాడుతోంది . చైనా పాలకులకు ఏది నచ్చక పోయినా తమకు జైలు శిక్ష తప్పదని వాళ్ళు భయపడుతున్నారు . ఒక్క ముక్క లో చెప్పాలంటే ఆసియా లోనే అతి పెద్ద ఫైనాన్స్ సెంటర్ పై దెబ్బ పడింది .

దాంతో హాంకాంగ్ కోల్పోయే ఫైనాన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకోడానికి రేసు మొదలయ్యింది. ఇప్పటికే టోక్యో , సింగపూర్ , దుబాయ్ ఇందుకోసం పోటీ పడుతున్నాయి. కానీ , అందుకు ముంబై సిద్ధమైతే మాత్రం మిగిలిన నగరాలు రేసులో వెనకబడటం ఖాయం. ఎందుకంటే ముంబైకి అలాంటి అవకాశాలున్నాయి . ప్రజాస్వామ్యం , స్వేచ్చా స్వాతంత్ర్యాలు ముంబైకి ఉన్న ప్రధాన అనుకూల అంశాలు . హాంకాంగ్ కోల్పోయింది. అందుకే ఫైనాన్స్ రంగ నిపుణులు మరో నగరం కోసం వెదుకుతున్నారు . ఫైనాన్స్ రంగానికి చెందిన పరిశోధనలు, విశ్లేషణలు ప్రజాస్వామ్యం లోనే పరిఢవిల్లుతాయి. భయం నీడలో అవి బతకలేవు . అందుకే ముంబై అందుకు అన్ని విధాలా సౌకర్యవంతమైన నగరమని ఒక చర్చ మొదలయ్యింది.

Read:షాకింగ్ వీడియో : మహిళను CAR తో ఢీ కొట్టి..వెళ్లిపోయిన SI