నా కొడుకును క్షమించండి : నిర్భయ తల్లిని వేడుకున్న ముకేష్ తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 04:00 AM IST
నా కొడుకును క్షమించండి : నిర్భయ తల్లిని వేడుకున్న ముకేష్ తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను(ముకేష్ సింగ్-32, పవన్​ గుప్తా-25, వినయ్​ శర్మ-26, అక్షయ్ ​-31) తీహార్‌ జైల్లో ఉరితీయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరగనుందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

నా కొడుకుని క్షమించండి:
కాగా, కోర్టు ఆదేశాలు జారీ చేసే సమయంలో నిర్భయ తల్లిదండ్రులు, దోషుల కుటుంబ సభ్యులతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. తీహార్​ జైల్లో ఉన్న దోషులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జడ్జి విచారించారు. వీడియో కాన్ఫరెన్స్​ రూమ్​లోకి మీడియాను అనుమతించలేదు. ఈ సమయంలో దోషి ముకేష్​ తల్లి కోర్టు హాల్లోకి ప్రవేశించారు. తన కొడుక్కి క్షమాభిక్ష పెట్టాలని కన్నీటి పర్యంతమయ్యారు. ముకేష్ పై దయ చూపాలని కోర్టును కోరారు. ఆమె విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో నిర్భయ తల్లి దగ్గరికి వెళ్లిన ఆమె ‘‘నా కొడుకును క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నా. అతడి ప్రాణం కోసం నేను ప్రాధేయపడుతున్నా” అంటూ తన చీర కొంగు పట్టుకుని నిర్భయ తల్లిని వేడుకున్నారు. దీనికి స్పందించిన నిర్భయ తల్లి ‘‘నాకు ఓ కూతురు ఉండేది. ఆమెకు ఏం జరిగిందో నేను ఎలా మర్చిపోగలను. న్యాయం కోసం నేను ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా” అని సమాధానం ఇచ్చింది.

ఉరి తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్లు:
జడ్డి ఆదేశాలు ఇవ్వగానే తీహార్​ జైలులో ఉన్న నలుగురు దోషులు కుప్పకూలిపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టులో ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తూ ఉండిపోయారు. కాగా, తమది పేద కుటుంబం కావడం వల్లే తన కుమారుడిని ఇందులో ఇరికించారని ముకేష్ తల్లి ఆరోపించారు. చివరికి తమ కుమార్తెకు న్యాయం జరిగిందని నిర్భయ పేరెంట్స్​ సంతోషం వ్యక్తం చేస్తే.. సుప్రీంకోర్టులో క్యూరేటివ్​ పిటిషన్లు వేసేందుకు నలుగురు దోషుల కుటుంబాలు రెడీ అవుతున్నాయి. మరోవైపు డెత్​ వారెంట్ రావడంతో ఉరి శిక్ష అమలుకు సంబంధించి ఏర్పాట్లను తీహార్​ జైలు అధికారులు మొదలుపెట్టారు.

ఏడేళ్ల క్రితం ఏం జరిగిందంటే: 
అది 2012 డిసెంబర్ 16 రాత్రి. దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్​ స్టూడెంట్ ​‘నిర్భయ’పై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యంత దారుణంగా గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు. సినిమాకు వెళ్లి తన స్నేహితునితో తిరిగి వస్తున్న నిర్భయ.. ఇంటికి వెళ్లేందుకు అటుగా వచ్చిన బస్సు ఎక్కారు. అయితే బస్సును దారి మళ్లించిన నీచులు.. ఆమె స్నేహితుడిని కొట్టి.. కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ఆమెపైకి బస్సు ఎక్కించి చంపేందుకు ప్రయత్నించినా.. స్నేహితుడు పక్కకు లాగడంతో నిర్భయ తప్పించుకుంది. అదే నెల 29న సింగపూర్​లోని మౌంట్ ఎలిజిబెత్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ నిర్భయ కన్నుమూసింది.

Also Read : బట్టతలని బాధపడకండి.. అమ్మాయిలను ఆకర్షించే సెక్సీలు మీరే!