రెండేళ్ల తర్వాత బయటకు: డేరా బాబా కేసులో హనిప్రీత్‌కు బెయిల్

  • Published By: vamsi ,Published On : November 7, 2019 / 01:58 AM IST
రెండేళ్ల తర్వాత బయటకు: డేరా బాబా కేసులో హనిప్రీత్‌కు బెయిల్

డేరా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కేసులు జైలు జీవితం అనుభవిస్తున్న డేరా బాబా దత్తపుత్రిక హనిప్రీత్ ఇన్సాన్‌కు బెయిల్ మంజూరు చేసింది హర్యాణా కోర్టు. అక్టోబర్‌ 2017 నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆమెకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) రోహిత్ వాట్స్ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.

ఆధ్యాత్మిక ముసుగులో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 

అత్యాచారం ఆరోపణలపై రామ్ రహీమ్ సింగ్ దోషిగా తేలిన తరువాత 2017 ఆగస్టులో హర్యానాలోని పంచకులాలో హింస చెలరేగింది. ఆగస్టు 25వ తేదీన జరిగిన అల్లర్లలో 29 మంది మరణించగా, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఆర్మీని మోహరించి అల్లర్లను అదుపులోకి తెచ్చింది.

ఈ కేసులో హనీప్రీత్ ఇన్సాన్ ప్రధాన నిందితురాలు. ఆమెతో పాటు మరో 41 మందిపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. అక్టోబర్‌ 2017లో వారిని అంబాలా జైలుకు తరలించారు. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేయబడింది. దీంతో ఆమె రెండేళ్ల తర్వాత బయటకు రాబోతున్నారు.