Covaxin : కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కేనా.. డబ్ల్యూహెచ్‌ఓతో కీలక భేటీ

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌- ఈయూఎల్‌) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది.

Covaxin : కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కేనా.. డబ్ల్యూహెచ్‌ఓతో కీలక భేటీ

Covaxin

Covaxin : భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌- ఈయూఎల్‌) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ విషయంలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దాఖలు చేసిన ఆసక్తి వ్యక్తీకరణను (ఈఓఐ) ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదించింది. నేడు(జూన్ 23,2021) ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశాన్ని ఖరారుచేసింది.

టీకా నాణ్యత, సామర్థ్యం, వినియోగించిన టెక్నాలజీ.. తదితర అంశాలను ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓకు భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు వివరించే అవకాశం ఉంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో నూతన లేదా లైసెన్సు లేని ఔషధాలు/ టీకాలను ఒక క్రమ పద్ధతిలో వినియోగించడానికి ఈయూఎల్‌ నిబంధనలను డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొచ్చింది. దీనికింద ‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి పొందడానికి ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తగిన
సమాచారాన్ని అందించింది.

ప్రీ-సబ్ మిషన్ నుంచి ఇంకా రెండు దశలున్నాయి. అత్యవసర అనుమతి పొందడానికి ఈ దశలూ పూర్తి కావాలి. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భారత్‌ బయోటెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకూ 5 సంస్థల టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి లభించింది. ఇందులో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, సినోఫార్మ్‌, సినోవ్యాక్‌ టీకాలున్నాయి.

ఈయూఎల్ పొందటానికి డబ్ల్యూహెచ్‌ఓకు 90 శాతం పత్రాలను సమర్పించామని, మిగిలిన పత్రాలను జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించాలని భావిస్తున్నట్లు భారత్ బయోటెక్ గత నెలలో కేంద్రానికి తెలియజేసింది. ఫేజ్ -3 ట్రయల్ డేటాలో కొవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యాన్ని చూపించిందని, వీటిని దేశంలోని సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమీక్షించి అంగీకరించింది. కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రజలకు టీకాలు ఇస్తోంది. ప్రస్తుతం మూడు టీకాలు(కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి) అందుబాటులో ఉన్నాయి. అందులో కొవాగ్జిన్ ఒకటి.