కోవాగ్జిన్ టీకా ధర తగ్గించిన భారత్ బయోటెక్

కోవాగ్జిన్ టీకా ధర తగ్గించిన భారత్ బయోటెక్

Covaxin Bharat Biotech

Covaxin price కరోనా వ్యాక్సిన్‌ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అమ్మే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను 100రూపాయలు తగ్గిస్తూ బుధవారం సీరం సంస్థ ప్రకటన చేయగా..తాజాగా భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ ధరను రూ.200 తగ్గించింది.

వ్యాక్సిన్ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవడం,వ్యాక్సిన్ ధరను తగ్గించాలని ఇటీవల ప్రధాని మోడీ సీరం,భారత్ బయోటెక్ లని కోరిన నేపథ్యంలో రాష్ట్రాలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను రూ.400కే వ్యాక్సిన్ ను అందిచనున్నట్లు భారత్ బయోటెక్ గురువారం ప్రకటించింది. కాగా,గతంలో రాష్ట్రాలకు ఈ ధర రూ.600గా భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.

ఇక, కొవాగ్జిన్‌ను ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఒక డోసు టీకా రూ.1200కి ఇవ్వనున్నట్లు గతంలో భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుంది. తమ టీకా తయారీ సామర్థ్యంలో 50 శాతానికి పైగా, కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడానికి ప్రత్యేకించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకాను భారత ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.150 ధరకు అందిస్తున్నామని తెలిపింది. టీకా అభివృద్ధి, క్లినికల్‌ పరీక్షల నిర్వహణ, ఉత్పత్తికి ఇప్పటివరకూ సొంత నిధులు ఖర్చు చేసినట్లు వివరించింది. ఇది ఎంతో శుద్ధి చేసిన ఇన్‌-యాక్టివేటెడ్‌ టీకా అని, దీన్ని తయారు చేయటం అత్యంత ఖరీదైన వ్యవహారమని తెలియజేసింది.

మరోవైపు, మే-1నుంచి వ్యాక్సినేషన్ మూడో ఫేజ్ లో భాగంగా దేశంలో 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్రాలు సిద్దమైన వేళ వ్యాక్సిన్ ల ధరలు తగ్గిస్తూ సీరం,భారత్ బయోటెక్ ప్రకటించడంతో రాష్ట్రప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి.