కరోనా​పై ‘కోవాగ్జిన్​’ 78 శాతం ప్రభావవంతం..ఆ విషయంలో 100శాతం

కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.

కరోనా​పై ‘కోవాగ్జిన్​’ 78 శాతం ప్రభావవంతం..ఆ విషయంలో 100శాతం

Covaxin Shows 78 Overall Interim Efficacy 100 Efficacy Against Severe Covid Bharat Biotech Icmr

Covaxin Phase 3 trial కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా‌ సోకకుండా అడ్డుకోవడంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ 78 శాతం సమర్థతను ప్రదర్శించినట్లు బుధవారం భారత్ బయోటెక్‌, ఐసీఎం‌ఆర్‌ ప్రకటించాయి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ అది ప్రాణాంతకంగా పరిణమించకుండా అడ్డుకోవడంలో కొవాగ్జిన్ 100 శాతం సమర్థతను రుజువు చేసుకుందని తెలిపాయి. హాస్పిటల్ లో చేరే పరిస్థితి లేకుండానే రోగులు కోలుకునేలా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఇక, కోవాగ్జిన్ మూడో దశ తుది విడత ఫలితాలు జూన్‌లో వెలువడుతాయని భారత్‌ బయోటెక్ తెలిపింది. ఈ మూడో దశ కోసం 25, 800 మంది వలంటీర్లను నియమించుకోగా.. వీరిలో 18 నుంచి 98 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు. కోవాగ్జిన్ రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత వాలంటీర్లపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసి ఈ ఫలితాలు వెల్లడించారు.

ఫలితాలపై స్పందించిన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా..కరోనాపై కోవాగ్జిన్ తన సమర్థతను రుజువు చేసుకుందని తెలిపారు. సార్స్‌- కోవ్‌-2 వైరస్‌తో పాటు వేరియంట్స్‌పై కొవాగ్జిన్ 78 శాతం సమర్థతతో పనిచేస్తుందని చెప్పేందుకు గర్విస్తున్నానని ఐసీఎమ్‌ఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ్ చెప్పారు. ఇక, ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1 కోటీ 10లక్షల మందికి కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందించగా.. మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4వేల 208 మందికి కరోనా సోకింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 17 లక్షల 37 వేల 178 మందిలో 695 మందికి కరోనా సోకింది. మొత్తం సంఖ్యలో ఇది 0.04 శాతం మాత్రమే.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి పదివేల మందిలో 2-4కి మాత్రమే కొవిడ్ సోకిందని బలరామ్ భార్గవ్ చెప్పారు.