కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా

కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా

భారత్‌లో CORONA తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన ఇండియా మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ఫార్ములాను పక్కాగా అమలు చేస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గుతూ వస్తోంది. వరుసగా ఆరో రోజు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.



24 గంటల వ్యవధిలో 10 లక్షల 89వేల 403 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 61 వేల 267 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నెల 1న 86 వేల వరకు నమోదైన కేసులు.. ఆ తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చాయి. ఇవాళ ఆ కేసుల సంఖ్య 61 వేలకు పడిపోయింది. మరోవైపు కొవిడ్‌తో 884 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య లక్షా 3వేల 569కి చేరింది.

వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 75 వేల 787గా నమోదైంది. ఇప్పటి వరకూ డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 56లక్షల 62వేల 490కి చేరింది. ప్రస్తుతం 9లక్షల 19వేల 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. ఇది చాలా ఊరటనిచ్చే విషయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా కరోనా జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణాల రేటు 1.55 శాతంగానే ఉంది. ఇది కూడా మంచి పరిణామం అంటున్నారు.

ప్రపంచ జనాభాలో పది మందిలో ఒకరు కోవిడ్‌ బారిన పడి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అయితే భారత్‌లో మాత్రం కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కరోనా మహమ్మారి రోజురోజుకి బలహీనపడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.