దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోటి 11లక్షలు దాటిన బాధితులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోటి 11లక్షలు దాటిన బాధితులు

Covid-19-cases-rise-in-india

Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.11 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో 98 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య లక్ష 57వేల 346కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. అలాగే… కొత్తగా 13వేల 123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.08 కోట్లు దాటింది. రికవరీ రేటు దేశంలో 97.1 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,70,126 ఉన్నాయి.

గడచిన 24గంటల్లో దేశంలో 7లక్షల 85వేల 220 కరోనా టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 21.84 కోట్లు దాటింది. అటు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశంలో ఇప్పటివరకూ వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 1,56,20,749కి చేరింది.

మొన్న యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గగా నిన్న మళ్లీ పెరిగింది(1768). పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 1,477 యాక్టివ్ కేసులు పెరిగాయి. పంజాబ్‌లో 345, ఢిల్లీలో 139, కర్ణాటకలో 121, గుజరాత్‌లో 91, మధ్యప్రదేశ్‌లో 72, హర్యానాలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 49, తెలంగాణలో 5 యాక్టివ్ కేసులు పెరిగాయి.

మహారాష్ట్రంలో నిన్న అత్యధికంగా 7.9 వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 2.9వేలు, పంజాబ్‌లో 729 వచ్చాయి. మహారాష్ట్రలో నిన్న 54 మంది చనిపోగా… కేరళలో 16, పంజాబ్‌లో 10 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసులు ఫిబ్రవరి 12న అతి తక్కువగా… 1.36 లక్షలు ఉండగా… అవి ఇప్పుడు 1.7 లక్షలకు చేరాయి. వీటిలో 75 శాతం యాక్టివ్ కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. కాగా, 24 రాష్ట్రాల్లో కొత్త మరణాలు సున్నాగా ఉండటం ఊరట కలిగించే అంశం.

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ లభించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేస్తారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250 ఇవ్వాల్సి ఉంటుంది. కాగా… ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వాళ్లు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికే టీకా వేస్తున్నారు.

తెలంగాణలో కొత్త‌గా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌ లేదు. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 99వేల 254కి చేరింది. ఇప్పటివరకు 2లక్షల 95వేల 707 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,635 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,912 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. వారిలో 796 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 29 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.