డాక్టర్లు,నర్సులకు డబుల్ శాలరీ ప్రకటించిన హర్యానా సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2020 / 04:12 PM IST
డాక్టర్లు,నర్సులకు డబుల్ శాలరీ ప్రకటించిన హర్యానా సీఎం

కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,టెస్టింగ్ ల్యాబ్ స్టాఫ్ లకు డబుల్ శాలరీ(రెట్టింపు జీతం)ఇవ్వనున్నట్లు గురువారం(ఏప్రిల్-9,2020)సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ లు,జిల్లా ఆయుర్వేదిక్ ఆఫీసర్లు,సివిల్ సర్జన్లు,మరికొందరితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు. కరోనా వైరస్ కాలం కొనసాగే వరకు… చికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొనే లేదా కరోనా రోగులను చూసుకునే సిబ్బంది జీతం రెట్టింపు చేసినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. వైద్యులను దేవుళ్లగా అభివర్ణించిన ఆయన వారు సైనికుల మాదిరిగా ఈ యుద్ధంలో పోరాడుతున్నారని మరియు మానవత్వాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు.

కేంద్రం ప్రకటించిన కొత్త ఇన్స్యూరెన్స్ పరిధిలోకి రాని వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ మరియు ఇతర సిబ్బందికి వరుసగా రూ .50 లక్షలు, రూ .30 లక్షలు, రూ .20 లక్షలు, రూ .10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రయోజనాలు లభిస్తాయని హర్యాణా సీఎం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, హర్యానాలో ఇప్పటివరకు 154కరోనా కేసులు నమోదుకాగా,ఇద్దరు మరణించారు.