Covid-19 lock Down : ఢిల్లీ టూ హైదరాబాద్.. ఏఏ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ

భారత్‌పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

Covid-19 lock Down : ఢిల్లీ టూ హైదరాబాద్.. ఏఏ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ

Covid 19 Lock Down

Covid-19 lock Down : భారత్‌పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా…రెండు లక్షలు..దాటి… రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. ఒక్కరోజులోనే దేశంలో 2లక్షల 73వేల 810 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికాలో థర్డ్‌ వేవ్ సమయంలో మూడు లక్షల కేసులు నమోదైతే.. ఆ పరిస్థితి మన దేశంలో సెకండ్ వేవ్ టైమ్‌లోనే కనిపిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. వరుసగా ఆరో రోజు కూడా వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. 24గంటల్లో కరోనాతో వెయ్యి 619 మందికిపైగా చనిపోయారు. లాన్‌సెట్‌ నివేదిక చెప్పింది చెప్పినట్లే జరుగుతోంది. ఈ వారంలో సగటున రోజుకు 17 వందల మంది చనిపోతారని లాన్‌సెట్‌ ఇదివరకే హెచ్చరించింది.

ఒక్కరోజే 2లక్షల 75 వేల పాజిటివ్‌ కేసులు నమోదవడంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి 50 లక్షలు దాటింది. ఒక్క అమెరికాలో తప్ప మరే దేశంలోనూ ఇన్ని కరోనా కేసులు లేవు. వారం రోజులుగా భారత్‌పై కరోనా విరుచుకుడుతోంది. ఈ ఏడు రోజుల్లో దాదాపు 15లక్షలు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది ఇండియా మొత్తం కేసుల్లో ఏకంగా 10శాతంగా ఉంది. అంటే గడిచిన వారం రోజులుగా భారత్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. గత ఫిబ్రవరి, మార్చిలలో నమోదైన పాజిటివ్‌ కేసుల కంటే ఈ ఏడు రోజుల్లో రికార్డయిన పాజిటివ్‌ కేసులే ఎక్కువ.

అటు పాజిటివిటీ రేటు భారత్‌లో ప్రకంపణలు సృష్టిస్తోంది. భారత్‌లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కేవలం 12 రోజుల్లోనే రెట్టింపయ్యింది. 12రోజుల క్రితం రోజువారీ పాజిటివిటీ రేటు 8 శాతంగా ఉంది. ఇది 16.69 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 కరోనా నిర్ధారణ పరీక్షల్లో దాదాపు 17 మంది పాజిటివ్‌గా తేలుతున్నారు. వీక్లీ పాజిటివ్‌ రేటు నెల రోజుల్లో 3 శాతం నుంచి దాదాపు 14 శాతానికి పెరిగింది. అత్యధికంగా వీక్లీ పాజిటివ్‌ రేటు చత్తీస్‌గఢ్‌లో 30శాతంగా ఉంది.

రాష్ట్రాలను వణికిస్తున్నకరోనా
కరోనా సెకండ్‌వేవ్‌తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు వైరస్‌కి బలైపోతున్నారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 68 వేలకు పైగా కేసులు నమోదయ్యయి. కరోనాతో 503 మంది చనిపోయారు.

కరోనాను కంట్రోల్‌ చేయడానికి కొన్ని రాష్ట్రాలు సెమీ లాక్‌డౌన్‌లు, నైట్‌ కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వీరవీహారం చేస్తోంది. మహారాష్ట్రకు తీసిపోని విధంగా అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 10 రోజుల ముందు రోజుకు 10 వేల కూడా నమోదుకాని పాజిటివ్‌ కేసులు.. ఇప్పుడు ఏకంగా 30 వేలు దాటేస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లో 
24 గంటల్లో యూపీలో 30 వేల 596 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి కేసులు ప్రారంభమైన తర్వాత యూపీలో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అటు కరోనాతో ఒక్కరోజులో 129 మంది చనిపోయారు. ఇక యూపీలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువైంది. యూపీ రాజధాని లక్నోలో ఒక్కరోజులో అత్యధికంగా 5 వేల 551 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 22 మంది మరణించారు.

ఢిల్లీ లాక్ డౌన్
ఇటు ఢిల్లీలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వైరస్‌ కట్టడి కోసం ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు చెయ్యాలని సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి(19 ఏప్రిల్ 2021) రాత్రి నుంచి వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 25వేలకు పైగా కేసులు నమోదవగా.. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ICUలో బెడ్స్‌ ఫుల్‌ అవగా.. మరోవైపు ఆక్సీజన్‌ కొరతతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. రెమ్‌డిసివర్‌ కొరత ప్రభావం కూడా రోగులపై పడుతోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేటి రాత్రి 10 గంటలకు మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లోకి రానుంది.

‘లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలన్నీ వర్క్‌ ఫ్రం హోం ద్వారానే నడవాలి. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు ఇవ్వనున్నారు.లాక్‌డౌన్ పొడిగించేందుకు ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

కర్ణాటక
అటు కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 19,067 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 81 మంది చనిపోయారు. ఇక కరోనా దెబ్బకు కర్ణాటక రాజధాని బెంగళూరు హడలిపోతోంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 మంది కరోనా బారిన పడుతున్నారు. కర్ణాటకలో నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా బెంగళూరులో నమోదవుతున్నాయి. మరోవైపు కేరళలో కరోనా కేసులు ఒక్కసారిగి పెరిగిపోయాయి. ఒక్కరోజే ఏకంగా 18 వేలకు పైగ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చూస్తుంటే కేరళ మరోసారి కరోనా సూపర్ హాట్‌స్పాట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నాయి.ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా ఆదివారం 10 వేల 723 పాజిటివ్‌లు, 42 మరణాలు చోటుచేసుకున్నాయి. రెండు వారాల్లో మూడింతల మేరకు కేసులు పెరగడంతో ఆంక్షలని కఠినం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ… ఆదివారాలు ఫుల్‌ లాక్‌డౌన్‌ అమలు చేయాలనినిర్ణయించింది.

ప్లస్‌టూ పరీక్షలు, పోలీసు, విద్యుత్‌ బోర్డు పరీక్షలన్నీ వాయిదా వేయాలని….. ప్రైవేటు సంస్థలు యాభై శాతం ఉద్యోగులతో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేపట్టే రీతిలో ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నైలోని 15 మండలాల్లోని ప్రజలకు కరోనా వైద్య, చికిత్సా సేవల నిమిత్తం ప్రత్యేకంగా కోవిడ్‌ కంట్రోల్‌రూం ఆదివారం ఏర్పాటైంది. 12,600 పడకలతో కేర్‌ సెంటర్లు సిద్ధం చేసినట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ఉధృతిని అరికట్టడానికి గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.