లాక్ డౌన్ వల్ల ఇల్లు గడవటానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు

  • Published By: chvmurthy ,Published On : April 29, 2020 / 11:49 AM IST
లాక్ డౌన్ వల్ల ఇల్లు గడవటానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు

కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇక కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ జనాల పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. లాక్ డౌన్ కారణంగా కొంతవరకు కరోనా కట్టడి అయినా జనాల జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయి.

నెల రోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు నడిపే వారు లాస్ అయ్యారు. దీంతో వారు ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టారు. తాము చేస్తున్న వ్యాపారాలు మానేసి కొత్తది స్టార్ట్ చేశారు. పండ్లు, కూరగయాలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు.

జీవనోపాధి కోసం కొత్త పని:
అవును దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి పరిస్థితే ఉంది. చాలామంది అప్పటివరకు తాము చేసిన వ్యాపారాలు మానేసి ఇప్పుడు పండ్లు, కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, డబ్బు సంపాదించడానికి, ఇల్లు గడవటానికి మరో మార్గం లేదని, అందుకే ఇలా పండ్లు, కూరగాయలు అమ్ముతున్నామని చెబుతున్నారు. లాక్ డౌన్ లో నిత్యవసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, పాలు, మందుల అమ్మకాలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

గతంలో చోలే అమ్మేవాడు, ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాడు:
ఉదాహరణకు ఢిల్లీకి చెందిన శంకర్ అనే వ్యక్తి చోలే కుల్చే అమ్మేవాడు. చోలే కుల్చే బాగా ఫేమస్ అయిన బ్రేక్ ఫాస్ట్. ఢిల్లీలో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్. లాక్ డౌన్ లేనప్పుడు శంకర్ వ్యాపారం బాగానే నడిచింది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దుకాణం మూత పడింది. దీంతో మరో దారి లేకపోవడంతో శంకర్ కూరగాయల వ్యాపారిగా మారాడు. ఈస్ట్ ఢిల్లీ పాండవ్ నగర్ లో ఓ వీధిలో తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్నాడు. చక్కగా రెడీ అయ్యి, టీ షర్ట్ వేసుకుని, చేతులకు గ్లౌస్ వేసుకుని, ముఖానికి మాస్క్ వేసుకుని మరీ కూరగాయలు అమ్మేందుకు వస్తాడు.

”ఈ పరిస్థితుల్లో మారో దారి లేదు. నా సేవింగ్స్ అంతా అయిపోయింది. స్నేహితుడి దగ్గర అప్పు చేశాను. జీవనోపాధి కోసం ఇలా కూరగాయలు అమ్ముతున్నా. చోలే కుల్చే అమ్మే రోజూ సంపాదించిన దానితో పోలిస్తే కూరగాయలు అమ్మడం ద్వారా సగమే వస్తోంది. అయినా తప్పదు” అని శంకర్ వాపోయాడు.

గతంలో ఎగ్ మీల్స్ అమ్మేవాడు, ఇప్పుడు పుచ్చకాయలు అమ్ముకుంటున్నాడు:
ఒక శంకరే కాదు మహమ్మాద్ అష్రఫ్(52) పరిస్థితీ అంతే. గతంలో ఆయన ఎగ్ మీల్స్ అమ్మేవాడు. లాక్ డౌన్ తో బిజినెన్ క్లోజ్ అయ్యింది. ఇంట్లో వాళ్లని పోషించుకోవడం కోసం ఇప్పుడు పండ్లు(పుచ్చకాయలు) అమ్ముతున్నాడు. ”నా 25 ఏళ్ల వ్యాపార జీవితంలో ఇలా పండ్లు అమ్మడం ఇది ఫస్ట్ టైమ్. ఇంటి అద్దె కట్టడానికి, ఇతర ఖర్చులకు నేను దాచుకున్న డబ్బు అంతా అయిపోయింది. పుచ్చకాయలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు కేవలం నా కుటుంబం ఆకలి తీర్చడానికి మాత్రమే సరిపోతుంది” అని అష్రఫ్ వాపోయాడు. అష్రఫ్ స్వస్థలం బీహార్. బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చాడు.

lock down effect

లాక్ డౌన్ కారణంగా రిక్షా తొక్కుతున్న వంట మనిషి:
ఇక అనిల్ శర్మ(46) అనే వ్యక్తిది ఇలాంటి పరిస్థితే. అనిల్ శర్మ రెండు నెలల క్రితమే అలీఘర్ నుంచి బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చాడు. ఓ బేకరీలో వంటవాడిగా పని చేస్తున్నాడు. ఇంతలో లాక్ డౌన్ అతడి జీవితాన్ని ఆగమాగం చేసింది. వంట పని పోయింది. దీంతో మరో దారి లేక పండ్లు, కూరగయాలు అమ్మడం ప్రారంభించానని కన్నీటిపర్యంతం అయ్యాడు. అంతేకాదు ప్రతి రోజూ ఉదయాన్నే రిక్షా తొక్కుతాడు. కూరగాయల మండీ నుంచి కూరగాయలను తీసుకొచ్చి షాపులకు సప్లయ్ చేస్తాడు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. ఎవరిని టచ్ చేసినా కన్నీళ్లు ఆగవు. గుండెలు తరుక్కుపోతాయి. లాక్ డౌన్ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలపై పెను ప్రభావమే చూపింది. ఉపాధి కరువైంది. రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చింది.