ఢిల్లీ ఆజాద్ పూర్ మండి సరికొత్త నిర్ణయం…కూరగాయల అమ్మకాల్లో సరి-బేసి రూల్స్

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 03:35 PM IST
ఢిల్లీ ఆజాద్ పూర్ మండి సరికొత్త నిర్ణయం…కూరగాయల అమ్మకాల్లో సరి-బేసి రూల్స్

కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)పాటించేందుకు దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని “ఆజాద్ పూర్ మండి”కీలక నిర్ణయం తీసుకుంది.  సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్టాలని ఆజాద్ పూర్ మండి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కూరగాయలు,పండ్ల అమ్మకాల సమయాల్లో కూడా మార్పులు చేస్తుంది.

మండిలో ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు కూరగాయల అమ్మకాలు,మధ్యాహ్నాం 2గంటల నుంచి 6గంటల వరకు పండ్ల అమ్మకాలు చేయాలని నిర్ణయించారు. 80ఎకరాలకు పైగా ఉన్న మండిలో సోషల్ డిస్టెన్స్ రూల్స్ పాటించట్లేన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆజాద్ పూర్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ(APMC)చైర్మన్ అదిల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ….22పెద్ద షెడ్లలో వందలమంది వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారని,ప్రతిరోజూ పెద్దసంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారని తెలిపారు.

సరి-బేసి రూల్స్ కింద… మొత్తం 22 షెడ్స్ ను వాటి నెంబర్ల ప్రకారం ఆపరేట్ చేయటానికి అనుమతిస్తామన్నారు. అంటే ఉదాహరణకు, ఓ సరి సంఖ్య రోజున, 0,2,4,6,8 వంటి సరిసంఖ్య ఉన్న షెడ్స్ ను తెరిచేందుకు అనుమతించనున్నట్లు అహ్మద్ ఖాన్ తెలిపారు. సోషల్ డిస్టెన్స్ ను మెయింటెన్ చేయడంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడనుందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా ఆజాద్ పూర్ మండిలోకి ఒక వ్యాపారికి రోజుకి ఒక ట్రక్కు మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. ఇప్పటివరకు మండి లోపలికి ఒక్కో వ్యాపారి 4-5ట్రక్కులను తీసుకెళ్తున్నారని తెలిపారు. మండిలో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని, అందరూ మాస్క్ లు ధరించాల్సిందేనని అహ్మద్ ఖాన్ తెలిపారు.

దేశరాజధానిలోని ఇతర మార్కెట్లలో కూడా సరి-బేసి రూల్స్ అమలుచేసే అవకాశమున్నట్లు సమాచారం. మార్కెట్లలో(మండీ)సోషల్ డిస్టెన్స్ నిర్వహణ విధానాలపై చర్చించేందుకు సోమవారం అన్ని హోల్ సేల్ మార్కెట్ల అధికారులను మీటింగ్ కు పిలిచారు ఢిల్లీ డెవలప్ మెంట్ మంత్రి గోపాల్ రాయ్.

See Also | ప్రపంచాన్ని చైనా మాత్రమే రక్షించగలదా? కరోనాతో ఎర్రబారిన ప్రపంచ దేశాలన్నీ.. డ్రాగన్ శరణు వేడుతున్నాయి